
‘బతుకమ్మ’ ఆటస్థలాల్లో ఏర్పాట్లు చేయాలి
● ఇన్‌చార్జ్ కలెక్టర్ పింకేష్‌కుమార్
జనగామ రూరల్: జిల్లాలోని బతుకమ్మ ఆటస్థలా లను ముందుగా గుర్తించి ఏర్పాట్లు పూర్తి చేయాలని ఇన్‌చార్జ్ కలెక్టర్ పింకేష్‌కుమార్ అన్నారు. మంగళవారం బతుకమ్మ పండుగ వేడుకలను నిర్వహించేందుకు జిల్లాలోని సంబంధిత శాఖల అధికారులకు విధులు కేటాయించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ బతుకమ్మకుంట, రంగప్ప చెరువు ప్రాంతాల్లో ప్రత్యేక భద్రత ఏర్పాట్లు చేపట్టాలని పో లీస్‌శాఖ అధికారులకు సూచించారు. జిల్లా గ్రామీ ణాభివృద్ధి అధికారిని నోడల్ అధికారిగా ప్రత్యేక బాధ్యతలు కేటాయించారు. స్టేషన్‌ఘన్‌ఫూర్, పాలకుర్తి నియోజకవర్గాల్లో కూడా సంబంధిత అధికారులతో సహాయ సహకారాలు తీసుకొని బతుకమ్మ వేడుకలను ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. మున్సిపాలిటీ పరిధిలో చెత్తాచెదారం ఎప్పటికప్పుడు తొలగిస్తూ బ్లీచింగ్ చల్లించాలన్నారు. ఆట స్థలాల వద్ద వైద్యశిబిరాలు ఏర్పాటు చేయాలని, చెరువు వద్ద లోతట్టు ప్రాంతాలకు చిన్నారులు, మహిళలు వెళ్లకుండా భారీకేడ్స్ ఏర్పాటు చేయాలన్నారు. కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. అలాగే పట్టణంలోని బతుకమ్మ కుంటలో జెడ్పీసీఈఓ మాధురిషాతో కలిసి మొక్కలు నాటారు. పర్యాటకులకు ఆహ్లాదకరంగా ఉండేందుకు మొక్కలు పెంచాలన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఉద్యాన శాఖ అధికారి శ్రీధర్ రావు, మున్సిపల్ కమిషనర్ మహేశ్వర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
మోడల్ మార్కెట్ పనులు వేగవంతం చేయాలి
పట్టణంలోని అంబేడ్కర్ నగర్‌లో సుమారు రూ.6 కోట్లతో నిర్మిస్తున్న సమీకృత మోడల్ మార్కెట్ భవన నిర్మాణ పనులను ఇన్‌చార్జ్ కలెక్టర్ పింకేష్ కుమార్ మంగళవారం సంబంధిత అధికారులతో కలిసి ఆకస్మికంగా సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలకు అతి సమీపంలో ఉండాలనే ఉద్దేశంతో చేపట్టిన మోడల్ మార్కెట్ నిర్మాణ పనులను నాణ్యతతో చేపట్టాలన్నారు. పనులు త్వరగా పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకు రావాలన్నారు. కలెక్టర్ వెంట మున్సిపల్ కమిషనర్ మహేశ్వర్ రెడ్డి, ఇంజనీరింగ్ అధికారులు తదితరులు పాల్గొన్నారు.