
మత్తళ్లు పోస్తున్న చెరువులు
● చీటకోడూరు రిజర్వాయర్ నాలుగు గేట్లు ఎత్తిన ఇరిగేషన్ అధికారులు
జనగామ: అల్పపీడన ప్రభావంతో గత కొద్ది రోజులుగా కురుస్తున్న వర్షాలతో జిల్లా వ్యాప్తంగా జలకళ సంతరించుకుంది. ఈ నెల 22వ తేదీ నుంచి మంగళవారం సాయంత్రం వరకు జిల్లాలో 31.7 మిల్లీ మీటర్ల వర్షపాతం కురిసింది. జనగామ మండలం గానుగుపహాడ్, వడ్లకొండ ఆనం చెరువు సమీపంలోని గుట్టల ప్రాంతం నుంచి వచ్చిన వరద నీటితో జనగామ చీటకోడూరు డ్యాం ఫుల్ ట్యాంక్ లెవల్‌కు చేరుకుంది. డ్యాం కెపాసిటీ 389 అడుగులు కాగా (0.3 టీఎంసీ సామర్థ్యం), అంతకు మించి వరద రావడంతో నీరు డ్యాం గేట్లపై నుంచి దూకాయి. సమాచారం అందుకున్న ఇరిగేషన్ డీఈ రవి కుమార్, ఏఈఈ కమలాకర్‌తో కలిసి సీఈ ఆర్.సుధీర్ డ్యాం వద్దకు చేరుకుని ఎగువ ప్రాంతం నుంచి వచ్చే వరద తీవ్రతను అంచనా వేసి, నాలుగు గేట్లు ఎత్తి దిగువకు విడుదల చేశారు. చీటకొడూరు, యశ్వంతాపూర్ వాగుల మీదుగా లింగాలఘణపురం మండలం నుంచి పాలకుర్తి వరకు విస్తరించిన వాగులన్నీ నిండుకుండలా మారనున్నాయి. జిల్లాలో 770 చెరువులు ఉండగా, 100 శాతం 341 చోట్ల నిండగా, 157 చెరువులు మత్తళ్లు పోస్తున్నాయి.