
ఏఎంసీలో నిధుల విడుదలపై విచారణ
జనగామ: జనగామ వ్యవసాయ మార్కెట్‌లో నిధుల విడుదల, సీసీఐ కేంద్రాల్లో పని చేసిన ఆపరేటర్ల వేతనాల చెల్లింపులో వచ్చిన ఆరోపణల నేపధ్యంలో రాష్ట్రస్థాయి ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు వరంగల్ మార్కెటింగ్ శాఖ రీజినల్ డిప్యూటీ డైరెక్టర్ వి.పద్మావతి ఆధ్వర్యంలో మంగళవారం జనగామ వ్యవసాయ మార్కెట్‌లో విచారణ జరిపారు. గతంలో పని చేసిన కార్యదర్శితో పాటు ప్రస్తుత అధికారిని వేర్వేరుగా విచారించి వివరాలను సేకరించారు. నిబంధనలకు విరుద్ధంగా రూ.10 లక్షలు డ్రా చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. ఈ నిధులు డ్రా చేసుకున్నప్పటికీ, నిబంధనలు అడ్డురావడంతో ఉన్నతాధికారులు గత కార్యదర్శిని సస్పెండ్ చేశారు. దీనిపై సదరు అధికారి అప్పీళుకు వెళ్లడంతో మరోసారి విచారణ చేపట్టారు. గత సీజన్‌లో పత్తి కొనుగోళ్లు చేసే సమయంలో 10 మంది డాటా ఎంట్రీ ఆపరేటర్లు సీసీఐ కేంద్రాల్లో పని చేశారు. వీరు తాత్కాలిక పద్ధతిలో నాలుగు నెలల పాటు పనిచేశారు. వీరికి రూ.5.17లక్షల వేతనాలు ప్రభుత్వం నుంచి విడుదల కాగా గతంలో పని చేసిన కార్యదర్శి వేతనాలు ఇవ్వకుండా జాప్యం చేస్తున్నాడని ఫిర్యాదు చేయడంతో ఇందుకు సంబంధించి సదరు అధికారిని పిలిపించి విచారణ చేపట్టారు. ఈ నివేదికను రాష్ట్ర స్థాయి ఉన్నతాధికారులకు అందజేస్తామని పద్మావతి తెలిపారు.