
నియోజకవర్గ అభివృద్ధే ధ్యేయం
స్టేషన్‌ఘన్‌పూర్: పదే పదే చెప్తున్నా, ఇవే నా చివరి ఎన్నికలు.. నియోజకవర్గ అభివృద్ధే నా ప్రధాన ఎజెండా.. చిలిపి చేష్టలు లేవు, చిల్లర పనులు చేయను అంటూ ఎమ్మెల్యే కడియం శ్రీహరి మాజీ ఎమ్మెల్యే డాక్టర్ తాటికొండ రాజయ్యపై ఘాటైన విమర్శలు చేశారు. ఘన్‌పూర్ డివిజన్ కేంద్రంలోని రైతు వేదికలో రెవెన్యూశాఖ వారి ఆధ్వర్యంలో లబ్ధిదారులకు కల్యాణలక్ష్మీ, షాదీముభారక్ చెక్కుల పంపిణీ కార్యక్రమాన్ని శనివారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆర్డీఓ డీఎస్ వెంకన్న అధ్యక్షతన నిర్వహించిన సమావేశంలో ముఖ్యఅతిథిగా ఎమ్మెల్యే కడియం పాల్గొని మాట్లాడారు. రాజకీయ విలువలు లేకుండా నీచ రాజకీయాలు చేస్తున్నారని, వ్యక్తిగత దూషణలే కాకుండా కుటుంబ సభ్యులపై దూషణలు చేస్తున్నారని మండిపడ్డారు. నియోజకవర్గ ప్రజలు తల ఎత్తుకునేలా అభివృద్ధి చేస్తానన్నారు. కాగా ఎమ్మెల్యేగా గెలిచిన నాటి నుంచి ఇప్పటి వరకు నియోజకవర్గానికి రూ.1025 కోట్ల అభివృద్ధి పనులు తీసుకువచ్చానన్నారు. సీఎం రేవంత్‌రెడ్డి నాపై ఉన్న నమ్మకంతో అడిగిందే తడువుగా నిధులు అందిస్తున్నారని, సీఎంకు రుణపడి ఉండాలన్నారు. కార్యక్రమంలో ఏఎంసీ చైర్‌పర్సన్ జూలుకుంట్ల లావణ్య, వైస్ చైర్మన్ నూకల ఐలయ్య, పీఏసీఎస్ చైర్మన్ దూదిపాల నరేందర్‌రెడ్డి, తహసీల్దార్ వెంకటేశ్వర్లు, ఏఓ చంద్రన్‌కుమార్, నాయకులు జూలుకుంట్ల శిరీష్‌రెడ్డి, అంబటి కిషన్‌రాజు, పోగుల సారంగపాణి, బూర్ల శంకర్, కొలిపాక సతీష్ తదితరులు పాల్గొన్నారు.
చిలిపి చేష్టలు లేవు..
చిల్లర పనులు చేయను
ఎమ్మెల్యే కడియం శ్రీహరి