
రెండో పంటకు సాగునీరు
● యూరియా కొరత లేకుండా చూడాలి
● జిల్లా అధికారులతో స్టేషన్ ఘన్‌పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి సమీక్ష
జనగామ రూరల్: జిల్లాలోని రైతులకు ప్రభుత్వం అండగా ఉంటుందని, రెండో పంటకు సాగునీరు, యూరియా కొరత లేకుండా అందిస్తామని స్టేషన్ ఘన్‌పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి అన్నారు. శుక్రవారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలోని కాన్ఫరెన్స్ హాల్‌లో నీటిపారుదల పనులు, యూరియా పంపిణీపై ఇన్‌చార్జ్ కలెక్టర్ పింకేశ్ కుమార్, అదనపు కలెక్టర్ బెన్ షాలోమ్, నీటిపారుదల చీఫ్ ఇంజనీర్ సుధీర్‌తో కలిసి సంబంధిత అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కడియం శ్రీహరి మాట్లాడుతూ.. నియోజకవర్గ పరిధిలోని సాగునీటి ప్రాజెక్టుల నిర్వహణ పకడ్బందీగా చేపట్టాలని అన్నారు. దేవాదుల ప్రాజెక్టు ఎత్తిపోతల పథకం నీరు ఒక చుక్క వృథా కాకూడదని అధికారులకు సూచించారు. జిల్లాలో యూరియా పంపిణీకి జిల్లా యంత్రాంగం తీసుకుంటున్న ప్రత్యేక చర్యలను ప్రశంసించారు. సమీక్ష సమావేశంలో జిల్లా రెవెన్యూ అధికారి సుహాసిని, ఆర్డీవోలు గోపిరామ్ డీఎస్ వెంకన్న, వ్యవసాయ శాఖ అధికారి అంబికా సోనీ తహసీల్దార్లు, ఇంజనీరింగ్, వ్యవసాయ శాఖ అధికారులు పాల్గొన్నారు.