జిల్లా కలెక్టర్ ఎ.తమీమ్ అన్సారియా
గుంటూరు వెస్ట్: ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పి.జి.ఆర్.ఎస్.)లో అందిన ఆర్జీల పరిష్కారంలో అలసత్వం వద్దని జిల్లా కలెక్టర్ ఎ. తమీమ్ అన్సారియా ఆదేశించారు. సోమవారం స్థానిక కలెక్టరేట్‌లోని ఎస్‌ఆర్ శంకరన్ సమావేశ మందిరంలో నిర్వహించిన పీజీఆర్‌ఎస్ కార్యక్రమంలో కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రతీ అర్జీ పరిశీలించి, స్పష్టమైన పరిష్కారం చూపాలని అన్నారు. ప్రజలు తమ సమస్యల పరిష్కారం కోసం వ్యయప్రయాసలతో వస్తారని గుర్తుచేశారు. పరిష్కారం చూపినప్పుడే సంతృప్తి కలుగుతుందని చెప్పారు. క్షేత్ర స్థాయిలోకి వెళ్లి వాస్తవాలు తెలుసుకోవాలని కోరారు. అర్జీని నిర్దేశిత సమయంలో పరిష్కరించాల్సిందేనని స్పష్టం చేశారు. ప్రీ ఆడిట్ సక్రమంగా చేయాలని అన్నారు. 220 అర్జీలను కలెక్టర్‌తోపాటు జాయింట్ కలెక్టర్ అశుతోష్ శ్రీవాస్తవ, జిల్లా రెవిన్యూ అధికారి ఎన్.ఎస్.కె.ఖాజావలి, ఆర్‌డీవో కె.శ్రీనివాస రావు, పీజీఆర్‌ఎస్ నోడల్ అధికారి గంగారాజు, డిప్యూటీ కలెక్టర్ విజయ లక్ష్మి, డీఎంహెచ్‌ఓ కె. విజయ లక్ష్మి, గ్రామీణ నీటి సరఫరా విభాగం పర్యవేక్షక ఇంజినీర్ కల్యాణ చక్రవర్తి, జిల్లా అధికారులు పరిశీలించారు.