
పేదల బియ్యం.. కూటమి నిర్లక్ష్యం
గత ప్రభుత్వంలో పక్కాగా..
ఏలూరు (మెట్రో): పేదలకు రేషన్ బియ్యం పంపిణీలో కూటమి ప్రభుత్వం నిండా నిర్లక్ష్యం చూపుతోంది. అక్టోబర్ నెలకు సంబంధించి ఐదు రోజులు గడిచినా ఇప్పటికీ పూర్తిస్థాయిలో రేషన్ సరకులను డీలర్లకు సరఫరా చేయలేదు. దీంతో పేదలు ఇబ్బంది పడుతున్నారు. గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో పక్కాగా అమలు చేసినా ఇంటింటికీ రేషన్ ప్రక్రియను నిలిపివేసిన కూటమి ప్రభుత్వం.. తాజాగా సరకుల పంపిణీపైనా అశ్రద్ధ చూపుతోంది. ప్రతినెలా ఒకటో తారీఖు నుంచి సరకుల పంపిణీని ప్రారంభించాల్సి ఉండగా ఈనెల 6వ తేదీ వచ్చినా 70 శాతం రేషన్ షాపులకు పూర్తిస్థాయిలో బియ్యం సరఫరా కాలేదు. దీంతో ఈనెల 2న దసరా పండగ నాడూ పేదలకు రేషన్ కష్టాలు తప్పలేదు.
జిల్లాలో 6.18 లక్షల మంది..
రేషన్ దుకాణాలు ఎప్పుడు తెరుస్తారో, ఎప్పుడు మూస్తారో తెలియక ప్రతినెలా ప్రజలకు ఎదురుచూపులు తప్పడం లేదు. జిల్లాలో 6,18,864 మంది కార్డుదారులు ఉండగా వీరికి ప్రతినెలా బియ్యం, పంచదార పంపిణీ చేస్తున్నారు. బియ్యం సరఫరా చేయడానికి జిల్లాలోని పౌరసరఫరాల గోదాములు ఉన్నాయి. అక్టోబర్ నెల బియ్యం రేషన్ డిపోల ద్వా రా ప్రజలకు అందించేందుకు సెప్టెంబరు 20 నా టికి గోదాములకు, 25 నుంచి 30లోపు అన్ని రేషన్ దుకాణాలకు పూర్తిస్థాయిలో నిల్వలు చేరుకోవాల్సి ఉంది. ఇలా జరిగితేనే ఒకటో తేదీన డీలర్లు పంపిణీ ప్రక్రియను ప్రారంభిస్తారు. అయితే అక్టోబర్‌కు సంబంధించి ఇప్పటికీ పూర్తిస్థాయిలో రేషన్ షాపులకు బియ్యం చేర్చడంలో ప్రభుత్వం విఫలమైంది.
సాంకేతిక ఇబ్బందులంటూ..
జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారులు మాత్రం రాష్ట్రంలో నూతనంగా ఏర్పాటు చేసే సాంకేతికత వల్ల వచ్చిన ఇబ్బందులతో జిల్లాలో బియ్యం సరఫరాకు తీవ్ర ఆటంకం కలిగిందని చెబుతున్నారు. గత నెల రోజులుగా సాంకేతిక సమస్యల పరిష్కారం కో సం చర్యలు తీసుకుంటున్నారని అయినా సమస్య పరిష్కారానికి మరికొంత సమయం పడుతుందని అంటున్నారు. జిల్లాలో ఇప్పటికే రేషన్ దుకాణాలకు సరకుల పంపిణీ ప్రక్రియ ప్రారంభం అయ్యిందనీ, సోమ, మంగళవారాలకు పూర్తిస్థాయిలో సరకులను సరఫరా చేస్తామని చెబుతున్నారు.
15 వరకూ మాత్రమే..
రేషన్ పంపిణీ ప్రక్రియ ప్రతి నెలా 15వ తేదీ వరకూ మాత్రమే కొనసాగుతుంది. అయితే ఈ నెలలో షాపులకు సరకులు సరఫరా కాని పరిస్థితుల్లో ఎన్ని రోజులపాటు రేషన్ దుకాణాలు తెరుస్తారు, ఎన్నిరోజుల పాటు డీలర్లు సరకులు పంపిణీ చేస్తారో ప్రజలకు అర్థం కాని పరిస్థితి. జిల్లావ్యాప్తంగా 1,123 రేషన్ దుకాణాల ద్వారా 6,18,864 మంది కార్డుదారులు ప్రతి నెలా రేషన్ పొందుతున్నారు. వీటిలో 34,188 మంది ఏఏవై కార్డుదారులు ఉన్నారు. వీరికి ప్రతి నెలా 35 కిలోల చొప్పున బియ్యం అందిస్తారు. ఇక మిగిలిన 5,84,676 మంది కార్డుదారులకు 8,316.525 టన్నుల బియ్యం అందిస్తున్నారు. మొత్తంగా కూటమి ప్రభుత్వం నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తోంది.
రేషన్ బియ్యం పంపిణీలో అలసత్వం
జిల్లాలో 70 శాతం దుకాణాలకు చేరని సరకులు
6వ తేదీ వచ్చినా ప్రారంభం కాని పంపిణీ
దసరా పండగకూ పస్తులు పెట్టిన సర్కారు
జిల్లావ్యాప్తంగా 6.18 లక్షల కార్డుదారులకు ఇబ్బందులు
పేదల రేషన్ కష్టాలను తొలగించేందుకు గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో ఎండీయూ వాహనాల ద్వారా ఇంటికే రేషన్ ప్రక్రియను ప్రారంభించారు. ప్రతినెలా ఒకటో తారీఖు నుంచి లబ్ధిదారుల ఇంటి వద్దకే వచ్చి నిత్యావసర సరకులు అందించేవారు. అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎండీయూ వాహనాల ద్వారా రేషన్ సరకులు అందించే ప్రక్రియను నిలిపివేసి, రేషన్ షాపుల ద్వారా పంపిణీని పునః ప్రారంభించింది. దీంతో పేదలు ప్రతినెలా రేషన్ షాపుల వైపు పరుగులు తీస్తూ దుకాణాల వద్ద బారులు తీరే పరిస్థితి.