
మట్టి అక్రమ తవ్వకాలు
కొయ్యలగూడెం: తవ్వుకున్నోళ్లకు తవ్వుకున్నంత అన్న చందంగా గంగవరం మెట్ట ప్రాంతం సిరులు కురిపిస్తుంది. రాజవరం పంచాయతీ గంగవరం మెట్టగా పిలవబడే ప్రాంతం నాణ్యమైన గ్రావెల్‌కి పెట్టింది పేరు. దీంతో కొయ్యలగూడెం, జంగారెడ్డిగూడెం, ద్వారకా తిరుమల మండలాలకు చెందిన అక్రమార్కులు సిండికేటుగా ఏర్పడి గ్రావెల్ తవ్వకాలను భారీగా నిర్వహిస్తున్నారు. గ్రావెల్ తవ్వకాలు లాభసాటిగా ఉండటంతో అక్రమార్కులు ఏకంగా సొంతంగా లారీలనే కొనుగోలు చేసి గ్రావెల్ తవ్వకాలు కొనసాగిస్తున్నారు. తవ్వకాలను నిరోధించాల్సిన వివిధ శాఖల అధికారులకు ముందుగానే అధికార పార్టీ పెద్దలు హుకుం జారీ చేయడంతో వీళ్ళ ఇష్టారాజ్యం సాగుతోంది. భారీ వాహనాలు రాకపోకలు సాగిస్తుండడంతో వ్యవసాయ పొలాలలోకి వెళ్లే రహదారులు అధ్వాన్నంగా మారుతున్నాయని అసలే వర్షాకాలం కావడంతో భారీ గోతులు పడి ప్రమాదాలకు కారణం అవుతున్నాయని రైతులు వాపోతున్నారు. గంగవరం ప్రాంతంలో గట్టి నిఘా ఏర్పాటు చేయాలని కోరుతున్నారు.