హత్యకేసులో ఆరుగురి అరెస్ట్‌ | - | Sakshi
Sakshi News home page

హత్యకేసులో ఆరుగురి అరెస్ట్‌

Oct 6 2025 2:40 AM | Updated on Oct 6 2025 2:40 AM

హత్యకేసులో ఆరుగురి అరెస్ట్‌

హత్యకేసులో ఆరుగురి అరెస్ట్‌

రెండు రోజుల్లోనే కేసును చేధించిన పోలీసులు

చోరీ సొత్తు పంపకాల్లో విభేధాలే హత్యకు కారణం: పోలీసులు

జంగారెడ్డిగూడెం: జంగారెడ్డిగూడెం పట్టణంలో జరిగిన హత్యకేసును పోలీసులు రెండు రోజుల్లోనే చేధించారు. ఆరుగురు నిందితులను అరెస్టు చేసినట్లు డీఎస్పీ యు.రవిచంద్ర వెల్లడించారు. ఆదివారం స్థానిక పోలీసు సర్కిల్‌ కార్యాలయంలో వివరాలు వెల్లడించారు. తెలంగాణ రాష్ట్రం వరంగల్‌ జిల్లాలో చేసిన దొంగతనాలకు సంబంధించి చోరీ సొత్తు పంపకాల విషయంలో జరిగిన విభేదాల కారణంగా పాత నేరస్తుడు కర్రి రాజేష్‌ (26) హత్యకు దారి తీసినట్లు చెప్పారు. ఈ కేసులో పట్టణానికి చెందిన షేక్‌ ఖాసిం, అతని అన్నలు షేక్‌ నాగుల్‌ మీరా, షేక్‌ జహీరుద్దీన్‌ అలియాస్‌ చోటు, వాసంశెట్టి పవన్‌కుమార్‌ అలియాస్‌ స్కైలాబ్‌, సమ్మంగి మంగరాజు, మరీదు సాయి అలియాస్‌ సైకో సాయిలను అరెస్టు చేసినట్లు డీఎస్పీ చెప్పారు.

కర్రి రాజేష్‌, షేక్‌ ఖాసిం తదితరులు కలిసి దొంగతనాలు చేసేవారని, గతంలో వరంగల్‌ జిల్లాలో చేసిన దొంగతనాల్లో సొత్తు పంపకాల విషయంలో విభేదాలు తతెత్తినట్లు చెప్పారు. జంగారెడ్డిగూడెంలో పోలీసులు గతంలో రాజేష్‌ను అరెస్టు చేసినప్పుడు ఖాసిం తదితరుల పేర్లు పోలీసులకు చెప్పడంతో వీరి మధ్య విభేదాలు తలెత్తాయి. ఈ నేపధ్యంలో తమకు కోర్టులో బెయిల్‌ కోసం రూ.2 లక్షల వరకు ఖర్చు అయ్యాయని, ఖాసిం తదితరులు బెయిల్‌ కోసం ఖర్చుచేసిన డబ్బులు ఇవ్వాలని రాజేష్‌ను ఒత్తిడి చేశారు. అప్పటి నుంచి రాజేష్‌ తప్పించుకుని తిరుగుతుండగా, వీరి మధ్య వివాదం ముదిరింది. గత నాలుగైదు నెలల క్రితం ఖాసింను చంపేందుకు కర్రి రాజేష్‌ పథకం రూపొందించగా, అది విఫలమైంది. అది తెలుసుకున్న ఖాసిం, అతని సోదరులు నాగుల్‌ మీరా, జహీరుద్దీన్‌ రాజేష్‌ను అంతమొందించాలని పథకం వేశారు. ఈ నెల 3న రాజేష్‌ను అతని ఇంటికి వెళ్లి వెంబడించి తీసుకువెళ్లి స్థానిక బైనేరు ఒడ్డున ఖాసిం ముఠా హత్య చేసింది. ఆరుగురు కలిసి రాజేష్‌ను తీవ్రంగా కొట్టి, టవల్‌తో కాళ్లు కట్టేసి, పలు సార్లు కత్తితో పొడిచి గొంతు కోసి, చాకుతో పొడిచి పేగులు బయటకు వచ్చేలా దారుణంగా హత్య చేశారని డీఎస్పీ వివరించారు. హత్యకు ఉపయోగించిన రెండు చాకులు, రెండు మోటార్‌సైకిళ్లు, ఒక స్కూటీ, ఐదు సెల్‌ఫోన్‌లు స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు.

నిందితులపై పలు స్టేషన్లలో కేసులు

నిందితులు షేక్‌ ఖాసింపై సస్పెక్ట్‌ షీట్‌ ఉందని, కొయ్యలగూడెం, జంగారెడ్డిగూడెం, నల్లజర్ల, వరంగల్‌లో పలు కేసులు ఉన్నట్లు చెప్పారు. నాగుల్‌ మీరాపై జంగారెడ్డిగూడెం, వరంగల్‌, స్కైలాబ్‌పై జంగారెడ్డిగూడెం, కొయ్యలగూడెంలలో, మంగరాజు, చోటు, సైకో సాయిలపై జంగారెడ్డిగూడెం స్టేషన్‌లో కేసు ఉన్నట్లు డీఎస్పీ చెప్పారు. వీరిపై రౌడీ షీట్‌ ఓపెన్‌ చేస్తామని, అవసరమైతే పీడీ యాక్ట్‌ అమలు చేస్తామన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement