
రైతుల భూములు లాక్కోవడం దుర్మార్గం
ఏలూరు (టూటౌన్): ప్రభుత్వం 2013 భూ సేకరణ చట్టాన్ని తుంగలో తొక్కి రైతుల భూములను ప్రాజెక్టుల పేరుతో, పరిశ్రమల పేరుతో బలవంతంగా లాక్కోవడం దుర్మార్గమని ఏపీ రైతు సంఘం జిల్లా కార్యదర్శి కె.శ్రీనివాస్ విమర్శించారు. 2013 భూ సేకరణ చట్టాన్ని అమలు చేయకపోవడం అన్యాయమన్నారు. స్థానిక అన్నే భవనంలో నిర్వహించిన సంఘ ముఖ్య నేతల సంఘ జిల్లా అధ్యక్షుడు కట్టా భాస్కరరావు అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. జిల్లాలో నెలకొన్న రైతాంగ సమస్యలపై ఈ సందర్భంగా చర్చించి పలు తీర్మానాలు ఆమోదించారు. ఈ సందర్భంగా శ్రీనివాస్ మాట్లాడుతూ ప్రభుత్వం స్వామినాథన్ కమిషన్ సిఫార్సులను అమలు చేసి అన్ని పంటలకూ మద్దతు ధరలు ప్రకటించాలని డిమాండ్ చేశారు. సమావేశంలో సంఘ నేతలు ఎస్.సీతారామయ్య, కె.జలపాలు, బి.రాంబాబు, కె.శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.
ఆగిరిపల్లి: మండలంలోని శోభనాపురంలో వ్యక్తి విద్యుత్ షాక్‌తో మృతి చెందాడు. ఎస్సై శుభ శేఖర్ తెలిపిన వివరాల ప్రకారం మేడా తిరుపతిరావు (36) తోట రమేష్‌కి చెందిన పందుల ఫాంలో సహాయకుడిగా పనిచేస్తున్నాడు. ఆదివారం ఉదయం పందుల ఫాంను తిరుపతిరావు నీటితో శుభ్రం చేస్తుండగా పక్కనే ఉన్న విద్యుత్ వైర్లకు తగలడంతో విద్యుత్ షాక్ తగిలి కిందపడిపోయాడు. అక్కడ పనిచేస్తున్న సిబ్బంది వెళ్లి చూడగా అప్పటికే మృతిచెందాడు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. తిరుపతి రావుకు భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. అనారోగ్యంతో కొన్ని రోజుల క్రితం అతని కుమారుడు మరణించాడు. ఇంతలోనే తిరుపతిరావు మరణించడంతో ఆ కుటుంబంలో విషాద చాయలు అలముకున్నాయి.