
ఎదుర్కోలు వైభవం
● స్వర్ణ హనుమంత వాహనంపై ఊరేగిన శ్రీవారు
● నేడు స్వామివారి తిరుకల్యాణం
● ఉదయం 7 గంటల నుంచి సింహ వాహనంపై గ్రామోత్సవం
● ఉదయం 8 గంటల నుంచి భజనలు
● ఉదయం 9 గంటల నుంచి భక్తిరంజని
● ఉదయం 11 గంటల నుంచి కూచిపూడి నృత్య ప్రదర్శనలు
● సాయంత్రం 4 గంటల నుంచి నాదస్వర కచేరి
● సాయంత్రం 5 గంటల నుంచి కూచిపూడి నృత్య ప్రదర్శనలు
● రాత్రి 8 గంటల నుంచి శ్రీవారి తిరుకల్యాణం, అనంతరం వెండి గరుడ వాహనంపై గ్రామోత్సవం
● ప్రత్యేక అలంకారం : మోహినీ
ద్వారకాతిరుమల: ద్వారకాతిరుమల చినవెంకన్న క్షేత్రంలో స్వామివారి ఆశ్రయుజ మాస దివ్య బ్రహ్మోత్సవాలు కన్నుల పండువగా జరుగుతున్నాయి. ఆదివారం ఉదయం నూతన స్వర్ణ హనుమంత వాహనంపై స్వామివారు క్షేత్ర పురవీధుల్లో ఊరేగుతూ భక్తకోటికి దర్శనమిచ్చారు. సాయంత్రం స్వామివారి నిత్య కల్యాణ మండపంలో జరిగిన శ్రీవారి ఎదుర్కోలు ఉత్సవం భక్తులను పరవశింపజేసింది.
ఎదుర్కోలు ఉత్సవం ఇలా..
తొలుత స్వామి, అమ్మవార్లను ఆలయం నుంచి వెండి శేష వాహనంపై నిత్యకల్యాణ మండపం వద్దకు తీసుకువచ్చారు. అక్కడ విశేషంగా అలంకరించిన వేదికపై కల్యాణ మూర్తులను ఉంచి పుష్పాలంకారాలు చేశారు. అనంతరం మేళతాళాలు, మంగళ వా యిద్యాలు, అర్చకులు, పండితుల వేద మంత్రోచ్ఛరణల నడుమ ఎదుర్కోలు ఉత్సవాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా అధికారులు, అర్చకులు, పండితులు, భక్తులు రెండు జట్లుగా విడిపోయి ఒక జట్టు స్వామివారి గుణగణాలను, విశిష్టతను కొని యాడారు. రెండో జట్టు అమ్మవార్ల గుణగణాలు, కీర్తిని తెలియజేశారు. స్వామి కల్యాణోత్సవానికి ముందు రోజు వధూవరుల తరపు బంధువులు శుభలేఖను పఠించేందుకు జరిపే కార్యక్రమమే ఈ ఎదుర్కోలు ఉత్సవమని పండితులు తెలిపారు. రాత్రి స్వామివారికి జరగాల్సిన వెండి శేష వాహన సేవ వర్షం కారణంగా రద్దయ్యింది. ఆలయ ముఖ మండపంలో భూ వరాహ స్వామి అలంకారంలో స్వామి దర్శనమిచ్చారు. శ్రీహరి కళాతోరణ వేదికపై జరిగిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి.