
చలో విజయవాడ పోరుబాటకు సన్నద్ధం
ఏలూరు (టూటౌన్) : స్థానిక పవర్‌పేట మున్సిపల్ కార్పొరేషన్ హైస్కూల్‌లో రాష్ట్ర ఫ్యాప్టో ఆధ్వర్యంలో ఈనెల 7న చేపట్టనున్న చలో విజయవాడ పోరుబాట కార్యక్రమానికి సన్నాహక సమావేశాన్ని ఆదివారం నిర్వహించారు. ఏలూరు జిల్లా నుంచి వెయ్యి మందితో పోరుబాట కార్యక్రమం నిర్వహించాలని జిల్లా కార్యవర్గం నిర్ణయం తీసుకుంది. జిల్లా ప్యాఫ్టో చైర్మన్ జి.మోహన్, సెక్రటరీ జనరల్ ఎం. ఆదినారాయణ, కో–చైర్మన్లు జి.వెంకటేశ్వరరావు, జి.ప్రకాష్ తదితరులు పాల్గొన్నారు. ముఖ్య అతిథులుగా విచ్చేసిన ఏపీటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎన్.ప్రవీణ్ కుమార్, బీటీఏ అమరావతి స్టేట్ వైస్ ప్రెసిడెంట్ బి.విద్యాసాగర్‌లకు జిల్లా ఫ్యాప్టో తరఫున ధన్యవాదాలు తెలిపారు. ఇదిలా ఉండగా ఈనెల 7న పాఠశాలల్లో జీఎస్టీ అవగాహన కార్య క్రమాలు నిర్వహించాలని జిల్లా విద్యాశాఖాధికారి ఇచ్చిన ఆదేశాలపై అభ్యంతరం తెలిపారు. ఈ కార్యక్రమం విద్యార్థుల బోధనకు ఏమాత్రం ఉపయోగపడదని అన్నారు.
ఏపీఎస్‌టీఏ మద్దతు
ఫ్యాప్టో చేపట్టిన చలో విజయవాడ పోరుబాట ధర్నాకు ఏపీఎస్‌టీఏ పూర్తి మద్దతు ఇస్తుందని సంఘ రాష్ట్ర సహా అధ్యక్షుడు జీజేఎ స్టీవెన్, జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు కాటి వెంకటరమణ, తోట ప్రసాద్ ఓ ప్రకటనలో తెలిపారు.