
హత్య కేసులో ఆరుగురి అరెస్టు
తణుకు అర్బన్: తణుకులో యువకుడి అదృశ్యం ఆపై హత్య కేసును పోలీసులు చేధించారు. పక్కా ప్లాన్ ప్రకారమే తాడేపల్లిగూడెంకు చెందిన మాడుగుల సురేష్ (25)ను హత్యచేసినట్లుగా పోలీసులు నిర్ధారించారు. తాడేపల్లిగూడెం డీఎస్పీ డి.విశ్వనాథ్ తణుకు పట్టణ పోలీస్ స్టేషన్‌లో శనివారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో కేసుకు సంబంధించి వివరాలు వెల్లడించారు. న్యాయవాది తిర్రే సత్యనారాయణరాజు భార్య శిరీషతో మృతుడు సురేష్‌కు ఉన్న వివాహేతర సంబంధం కారణంగానే హత్య జరిగిందని, న్యాయవాది సత్యనారాయణరాజు మరో నలుగురి సాయంతో హత్య చేసినట్లుగా విచారణలో తేలిందని వివరించారు. తన భార్యతో సంబంధంపై సురేష్‌ను పలుమార్లు హెచ్చరించినప్పటికీ మార్పు రాకపోవడంతోనే హత్యకు పాల్పడినట్లుగా సత్యనారాయణరాజు ఒప్పుకున్నట్లు చెప్పారు. ఈ నెల 23న తన తమ్ముడు సురేష్ తణుకు వచ్చాడని తిరిగి తాడేపల్లిగూడెం రాలేదని అతని సోదరి ముచ్చె ప్రశాంతి ఇచ్చిన ఫిర్యాదుతో అదృశ్యం కేసు నమోదు చేశారు. దర్యాప్తులో భాగంగా హత్యగా బయటపడినట్లు వివరించారు. శిరీషను కలిసేందుకు తణుకు వచ్చిన సురేష్‌పై నిందితులు దాడి అనంతరం శవాన్ని గోనెసంచిలో కుక్కి తణుకు నుంచి కారులో తీసుకెళ్లి చించినాడ వద్ద గోదావరిలో పారేసినట్లుగా విచారణలో తేలిందన్నారు. మృతదేహాన్ని సఖినేటిపల్లి సమీపంలోని రామేశ్వరం పరిధిలో గుర్తించినట్లు తెలిపారు. మొత్తం 30 మందికి పైగా సాక్షులను విచారించారు. ఈ ఘటనలో ఇప్పటివరకు నిందితులు ఉపయోగించిన కియా సెల్టాస్ కారుతోపాటు మరో మూడు ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నామని, కేసు లోతుగా దర్యాప్తుచేసి మరెవరి ప్రమేయమైనా ఉందా అని తేల్చుతామన్నారు. ఈ కేసులో సత్యనారాయణరాజుతో పాటు వల్లూరి పండుబాబు, సరెళ్ల సాయి కృష్ణ, బంటు ఉదయ కిరణ్, గంటా ఫణీంద్ర బాబు, తిర్రే శిరీషలను అరెస్టు చేశారు. వీరికి శనివారం తణుకు జిల్లా కేంద్ర ఆస్పత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించి కోర్టులో హాజరుపరిచారు. మృతదేహాన్ని తరలించేందుకు వినియోగించిన కారు యజమాని, నిందితుడి సోదరుడు తిర్రే విజయకృష్ణను ఏ7గా చేర్చామని ప్రస్తుతం ఆయన పరారీలో ఉన్నారని చెప్పారు. కేసు దర్యాప్తులో పట్టణ సీఐ ఎన్.కొండయ్య, రూరల్ సీఐ బి.కృష్ణకుమార్, అత్తిలి ఎస్సై ప్రేమ్‌కుమార్, పట్టణ ఎస్సై కె.ప్రసాద్, ఏఎస్సైలు పి.సంగీత్‌రావు, పి.సత్యనారాయణ, ఎస్.శ్రీధర్‌తోపాటు 11 మంది కానిస్టేబుళ్ల చొరవను డీఎస్పీ ప్రశంసించారు.
వివాహేతర సంబంధమే కారణమని నిర్ధారణ