
చంద్రబాబు దళిత ద్రోహి
పెనుగొండ: ముఖ్యమంత్రి చంద్రబాబు దళిత ద్రోహిగా చరిత్రలో నిలిచిపోతారని ఆచంట నియోజకవర్గ వైఎస్సార్‌సీపీ ఎస్సీ సెల్ అధ్యక్షుడు పిల్లి రుద్ర ప్రసాద్ విమర్శించారు. చిత్తూరు జిల్లా వెదురుకుప్పం మండలం దేవళంపేటలో డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ విగ్రహానికి నిప్పు పెట్టడంపై నిరసన వ్యక్తం చేస్తూ ఆచంటలో అంబేడ్కర్ విగ్రహానికి క్షీరాభిషేకం చేసి పూలమాలలు వేసి నివాళులర్పించారు. వైఎస్సార్‌సీపీ సీనియర్ నాయకులు సుంకర సీతారామ్, కోట వెంకటేశ్వరరావు మాట్లాడుతూ అంబెడ్కర్ భావజాలంపై టీడీపీ మొదటి నుంచి విషం జిమ్ముతుందని అన్నారు. సీఎం సొంత జిల్లాలోనే ఇలాంటి దురగతం జరగడం బాధాకరమన్నారు. ఘటనకు కారణమైన టీడీపీ నేత సతీష్ నాయుడు పై అట్రాసిటీ కేసు నమోదు చేసి, కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ నాయకులు తప్పేట్ల వెంకట్రావు, చదలవాడ ఆనంద్, పీతల అంబేడ్కర్, చదలవాడ ముత్యాల రావు, కొంబోత్తుల దుర్గా ప్రసాద్, పుచ్చకాయల నాగార్జున, వడ్లపాటి అంబేడ్కర్, కోట గిరిధర్, పుచ్చకాయల భీమారావు, వడ్లపాటి నవీన్, వేమన అప్పారావు తదితరులు పాల్గొన్నారు.