
దేదీప్యం.. దివ్య తేజం
● సూర్యప్రభ వాహనంపై ఊరేగిన శ్రీవారు
● సరస్వతీదేవి అలంకరణలో దర్శనం
● మూడో రోజుకు చేరిన శ్రీవారి బ్రహ్మోత్సవాలు
బ్రహ్మోత్సవాల్లో నేడు
● ఉదయం 7 గంటల నుంచి హనుమద్వాహనంపై శ్రీవారి తిరువీధి సేవ
● ఉదయం 8 గంటల నుంచి భజన కార్యక్రమాలు
● ఉదయం 9 గంటల నుంచి భక్తిరంజని
● ఉదయం 10 గంటల నుంచి కూచిపూడి నృత్య ప్రదర్శనలు
● సాయంత్రం 4 గంటల నుంచి నాదస్వర కచేరి
● సాయంత్రం 5 గంటల నుంచి కూచిపూడి నృత్య ప్రదర్శనలు
● రాత్రి 7 గంటల నుంచి ఎదుర్కోలు ఉత్సవం, అనంతరం వెండి శేషవాహనంపై గ్రామోత్సవం
● శ్రీవారి ప్రత్యేక అలంకారం : భూ వరాహ స్వామి
ద్వారకాతిరుమల: చైతన్యమూర్తినే వాహనంగా మలచుకుని విహరించిన కలియుగ వైకుంఠవాసుడిని వీక్షించిన భక్తజనులు పులకించారు. ద్వారకాతిరుమల శ్రీవారి ఆశ్వయుజమాస దివ్య బ్రహ్మోత్సవాల్లో మూడో రోజు శనివారం ఉదయం సూర్యప్రభ వాహనంపై స్వామివారు భక్తులకు దర్శనమిచ్చారు. సూర్యుడు తేజోనిధి.. సకల రోగాలను నివారిస్తాడు. అందుకే వాహన సేవల్లో ఈ వాహనానికి అత్యంత ప్రాధాన్యం. తొలుత ఆలయంలో పంచాయుధాలను ధరించి నారాయణమూర్తి అలంకరణలో సూర్యప్రభ వాహనాన్ని అధిరోహించిన శ్రీవారికి అర్చకులు విశేష పుష్పాలంకారాలు చేసి హారతులిచ్చారు. అనంతరం ఆలయ ప్రధాన రాజగోపురం మీదుగా వాహనం క్షేత్ర పురవీధులకు పయనమైంది. తిరువీధుల్లో ఊరేగిన శ్రీవారికి భక్తులు నీరాజనాలు అర్పించారు. సూర్యప్రభ వాహనంపై ఉన్న స్వామివారిని దర్శిస్తే సకల విద్య, ఆరోగ్య, అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయని పండితులు తెలిపారు. ఇదిలా ఉండగా రాత్రి జరగాల్సిన చంద్రప్రభ వాహన సేవ వర్షం కారణంగా రద్దయ్యింది. బ్రహ్మోత్సవాల్లో భాగంగా సాంస్కృతిక కార్యక్రమాలు అలరిస్తున్నాయి. భరత నాట్య ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి.
చదువుల తల్లిగా శ్రీవారు : బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని శ్రీవారు ఆలయ ముఖ మండపంలో చదువుల తల్లి సరస్వతీ దేవిగా భక్తులకు దర్శనమిచ్చారు. ఈ అలంకారంలోని స్వామిని దర్శిస్తే ఇతి బాధలు ఉండవని, విద్య అపారంగా కలుగుతుందని పండితులు చెబుతున్నారు.
సరస్వతీదేవి అలంకారంలో శ్రీవారు

దేదీప్యం.. దివ్య తేజం

దేదీప్యం.. దివ్య తేజం