
అరకొర బస్సులు.. ప్రయాణికుల పాట్లు
● గొడవలు, తోపులాటలతో పోలీసుల రంగప్రవేశం ● రాత్రి వరకూ కొనసాగిన రద్దీ
ద్వారకాతిరుమల: ద్వారకాతిరుమల శ్రీవారి క్షేత్రా నికి వచ్చే యాత్రికులకు బస్సు ప్రయాణం.. ప్రహసనంగా మారింది. శనివారం క్షేత్రానికి వేలాది మంది భక్తులు విచ్చేశారు. తిరుగు ప్రయాణమయ్యే క్ర మంలో బస్టాండ్‌కు చేరుకున్నారు. అయితే బస్సులు అరకొరగా ఉండటంతో బస్సులు ఎక్కేందుకు పోటీపడ్డారు. దీంతో గొడవలు, కేకలతో బస్టాండ్ ప్రాంతం దద్దరిల్లింది. బస్టాండ్‌లోకి వస్తున్న బస్సులకు ఎదురెళ్లి ఎక్కుతుండటంతో దిగేవారు నానా అవస్థలు పడ్డారు. డ్రైవర్లు, కండక్టర్లు వారిస్తున్నా వినకుండా పలువురు ఫుట్‌బోర్డులపై నిలిచి మరీ ప్రమాదకర ప్రయాణాలు సాగించారు. చాలీచాలని బస్సులు, యాత్రికుల గొడవలతో స్థానిక ఎస్సై టి.సుధీర్ సిబ్బందితో కలిసి బస్టాండ్‌కు చేరుకుని ప్రయాణికులను నియంత్రించారు. మధ్యాహ్నం నుంచి రాత్రి వరకు బస్టాండ్‌లో ప్రయాణికుల రద్దీ కొనసాగింది. అయితే కొందరు భక్తులు బస్సులు ఎక్కలేమంటూ ఆటోలు ఎక్కి గమ్యస్థానాలకు చేరుకున్నారు. ప్రభుత్వ నిర్వాకం కారణంగా పోలీసులు బస్టాండుల్లో బస్సుల వద్ద విధులు నిర్వర్తించాల్సి వస్తోందని, ఆర్టీసీ డ్రైవర్లు, కండక్టర్లు భయపడాల్సి వస్తోందని పలువురు వాపోయారు. అయినా యాత్రికులకు సురక్షితమైన ప్రయాణం లేదని పలువురు అంటున్నారు.

అరకొర బస్సులు.. ప్రయాణికుల పాట్లు