
పేదల బియ్యం పక్కదారి
● రేషన్ డీలర్లే కొనుగోలు
● షాపుల్లోనే నిల్వలు.. రాత్రిళ్లు తరలింపు
లింగపాలెం: ‘కంచే చేను మేసిన’ చందంగా రేషన్ డీలర్లే పేదలకు అందించాల్సిన బియ్యాన్ని పక్క దారి పట్టిస్తున్నారు. కార్డుదారుల నుంచి నేరుగా కొనుగోలు చేసి రేషన్ షాపుల్లోనే నిల్వ ఉంచుతూ, రాత్రిళ్లు గుట్టుచప్పుడు కాకుండా అక్రమ బియ్యం వ్యాపారులకు ఎగుమతి చేస్తున్నారు. ఇదంతా బహిరంగంగా జరుగుతున్నా విజిలెన్స్, రెవెన్యూ అధికారులు మిన్నకుండిపోతున్నారు. ముఖ్యంగా లింగపాలెం మండలంలో కొందరు డీలర్లు పోటీపడి మరీ కార్డుదారుల నుంచి బియ్యం కొనుగోలు చేస్తున్నారు. బియ్యం కోసం రేషన్ షాపులకు వస్తున్న కార్డుదారులకు కిలోకు రూ.15 చొప్పున చెల్లిస్తున్నారు. బియ్యం కావాలా, డబ్బులు కావాలా అని అడుగుతుండటంతో కార్డుదారులు ఆశ్చర్యపోతున్నారు. గతంలో చాటుమాటున జరిగే ఈ వ్యవ హారం కూటమి ప్రభుత్వ పాలనలో బహిరంగంగానే జరుగుతోంది. లింగపాలెం మండలంలో నెల కు సుమారు 600 టన్నుల వరకూ ఇలా సేకరించడం, రేషన్ మాఫియా ఆగడాలకు అద్దూ అదుపులేకపోవడం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. లింగపాలెం, చింతలపూడి మండలాల్లో సుమారు 47 వేలకు పైగా బియ్యం కార్డులు ఉన్నాయి. వీరికి ప్రతినెలా బియ్యం కోసం ప్రభుత్వం రూ.9 కోట్లకు పైగా ఖర్చు చేస్తోంది. ప్రధానంగా రేషన్ బియ్యం వ్యాపారానికి డీలర్లు సహకరిస్తున్నారని, అయినా అధికారులు తనిఖీలు, చర్యలు తీసుకోవడం లేదని మండల ప్రజలు విమర్శిస్తున్నారు.