
రూప్‌చంద్ ధర పాతాళానికి
పట్టుబడి సమయానికి పడిపోతున్న ధర
దళారులదే రాజ్యం
ఇంత గడ్డు పరిస్థితి చూడలేదు
ఆక్వా సాగు చేయలేం
● నష్టాల ఊబిలో రైతులు
● సంక్షోభంలో రూప్‌చంద్ సాగు
● కిలో రూ.82కు పడిపోయిన ధర
గణపవరం: ఏడాది కాలంగా మంచి ధర పలుకుతున్న రూప్‌చంద్ ధర హఠాత్తుగా పడిపోవడంతో రైతుల్లో ఆందోళన నెలకొంది. రెండు నెలల వ్యవధిలోనే కిలోపై రూ.30 మేర పడిపోగా, గత జనవరితో పోలిస్తే ఏకంగా కిలోకి రూ.45 వరకూ తగ్గిపోయింది. దీంతో రూప్‌చంద్ రైతుల పరిస్థితి అగమ్య గోచరంగా తయారైంది. ప్రస్తుత ధర కిలో రూ.82కు అమ్మితే కనీసం పెట్టుబడులు సైతం దక్కవని రైతులు ఆందోళన చెందుతున్నారు. ధర పెరుగుతుందన్న ఆశతో రైతులు పట్టుబడికి వచ్చిన చేపలను చెరువులలోనే ఉంచి రోజుల తరబడి మేపుతున్నారు.
తగ్గిన రూప్‌చంద్ ఎగుమతులు
ధర పడిపోవడంతో రైతులు పట్టుబడులు నిలిపివేశారు. దసరా తర్వాతైనా ధర పెరుగుతుందన్న ఆశతో ఎదురుచూస్తున్నారు. జిల్లా నుంచి రోజూ సుమారు 30 నుంచి 40 లారీల రూప్‌చంద్ చేపల ఎగుమతులు జరిగేవి. ప్రస్తుతం రోజుకు 15 లారీలకు మించి జరగడంలేదని చెబుతున్నారు. గత జూలై వరకూ కిలో రూ.112 నుంచి రూ.115 వరకూ పలికిన ధర క్రమంగా తగ్గుతూ వారం రోజుల్లో కిలో రూ.82కు పడిపోయింది.
ఎకరాకు లక్ష రూపాయల నష్టం
రూప్‌చంద్ ధర అమాంతం పడిపోవడంతో రూప్‌చంద్ సాగుచేసిన రైతులు లబోదిబోమంటున్నారు. కరోనా సమయంలో తప్ప ఇంతటి గడ్డు పరిస్థితి ఎప్పుడూ చూడలేదని రైతులంటున్నారు. ప్రస్తుత ధరకు రూప్‌చంద్ అమ్మితే ఎకరాకు రూ.లక్ష వరకూ నష్టపోవాల్సి వస్తుందంటున్నారు. ఈ ధర ఇంకా తగ్గే అవకాశం ఉందన్న ప్రచారంతో ఆందోళన చెందుతున్నారు. ప్రస్తుత చెరువుల నిర్వహణ రీత్యా రూప్‌చంద్ ధర కనీసం కిలో రూ.95 ఉంటే పెట్టుబడులతో బయటపడతామని, ఈ ధరకు ఎంత తక్కువకు అమ్మితే ఆ మేరకు నష్టం తప్పదని రైతులు చెబుతున్నారు. ఏడాదిన్నర కాలంగా రూప్‌చంద్ ధర బాగుండటంతో రైతులు ఎక్కువ మంది రూప్‌చంద్ సాగులోకి దిగారు. కిలో రూ.110 దాటని ధర ఏడాది కాలంగా పెరుగుతూ కిలో రూ.127 వరకూ పెరిగింది. దీంతో చాలామంది రైతులు లాభపడ్డారు. ఏడాది కాలంగా ఈ ధర నిలకడగా ఉండటంతో ధర బాగుందన్న ఉద్దేశ్యంతో గత అక్టోబర్, నవంబర్ నెలల్లో చాలామంది రూప్‌చంద్ సాగు చేపట్టారు. అప్పట్లో రొయ్యసాగు చేసి తీవ్రంగా నష్టపోయిన చాలామంది రైతులు రూప్‌చంద్ సాగు చేపట్టారు. దీంతో రూప్‌చంద్ సాగు విస్తీర్ణం తెల్లచేపను మించిపోయింది.
రాబడి మేతలకే సరి
ప్రస్తుత ధరలో చేపను అమ్మితే వచ్చే సొమ్ము మేత ఖర్చులకే సరిపోతుందని, చెరువు లీజులు, సీడ్, మందులు, విద్యుత్ బిల్లులు, కాపలాదారుల ఖర్చు, నిర్వహణ వ్యయం రైతు భరించక తప్పదని వాపోతున్నారు. ఇవన్నీ కలిపితే ఎకరాకు కనీసం రూ.లక్ష వరకూ నష్టం వస్తుందని రైతులు గగ్గోలు పెడుతున్నారు. కొంతకాలం వేచి చూస్తే చేప ధర పెరుగుతుందన్న ఆశతో రోజుల తరబడి చేపలను చెరువులో ఉంచి మేపడం వల్ల మరింత నష్టం తప్పడం లేదని వాపోతున్నారు.
ప్రస్తుతం రూప్‌చంద్ పట్టుబడులకు సిద్ధంగా ఉంది. ఈ సమయానికి చేప ధర దారుణంగా తగ్గిపోవడంతో రైతుల పరిస్థితి అయోమయంగా తయారైంది. సరిగా పట్టుబడి సమయానికి ధర తగ్గిపోవడాన్ని రైతులు జీర్ణించుకోలేక పోతున్నారు. రెండేళ్ల క్రితం కూడా ఇదే విధంగా రూప్‌చంద్ ఎక్కువ విస్తీర్ణంలో పట్టుబడికి వచ్చిన సందర్భంగా చేప ధర కిలో రూ.60కు పడిపోయి రైతులు దారుణంగా నష్టపోయారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 2.25 లక్షల ఎకరాలలో ఆక్వాసాగు జరుగుతుండగా, సుమారు 1.30 లక్షల ఎకరాలలో చేపల సాగు చేస్తున్నారు.
ఆక్వా రంగంలో దళారులు, వ్యాపారులదే రాజ్యం. ప్రభుత్వ కనీస ధరలు నిర్ణయించినా అమలుకు నోచుకోవడం లేదు. నేను 27 ఎకరాలలో రూప్‌చంద్ సాగుచేస్తున్నాను. ప్రస్తుతం చేపలు పట్టుబడికి సిద్ధంగా ఉన్నాయి. ఈ సమయంలో ధర కిలో రూ.82కు పడిపోవడంతో ఏంచేయాలో పాలుపోవడంలేదు. ఈ ధరలో అమ్మితే రైతులకు పెట్టుబడి కూడా దక్కే పరిస్థితిలేదు. దీనికి తోడు ఆక్వాచెర్వులపై ఎడాపెడా విద్యుత్ బిల్లుల మోత మోగుతుంది.
– సంకు శ్రీనివాసరావు, రైతు
చేపఽల సాగు నష్టాలలో నడుస్తుండటంతో ఆ ప్రభావం సీడ్, చేప పిల్లపై పడింది. రూప్‌చంద్‌కు ధర లేకపోవడంతో మూడేళ్లుగా చేప పిల్లల వ్యాపారం నష్టాలలో నడుస్తుంది. గతంలో ఐదు అంగుళాల సైజు ఉన్న రూప్‌చంద్ చేపపిల్ల ధర రూ.9 పలికేది. రూప్‌చంద్ ధర పడిపోవడంతో సాగు తగ్గిపోతుంది. ప్రస్తుతం రూప్‌చంద్ సీడ్ కొనే నాధుడు కనిపించడంలేదు.
– సమయం వీరరాఘవులు, రూప్‌చంద్ పిల్ల పెంపకందారు
ఏడాదిన్నరగా చేపల సాగు నష్టాలతో నడుస్తుంది. వ్యాపారులు ధర తగ్గించేయడం, కంపెనీలు మేత ధర పెంచేయడంతో రైతులు నలిగిపోతున్నారు. ఇటీవల పది ఎకరాలలో రూప్‌చంద్ సాగుచేసి పది లక్షలు నష్టపోయాను. కొంత కాలంగా రూప్‌చంద్ ధర బాగుండటంతో మళ్లీ 20 ఎకరాలలో రూప్‌చంద్ వేశాను. ప్రస్తుతం పట్టుబడి దశకు చేరింది. గత నెలలో మిడిల్ క్రాప్ తీస్తే కిలోలోపు సైజుకు రేటు రూ.90 వచ్చింది. ఇప్పుడు కిలోసైజు చేపధర రూ.80కు పడిపోయింది.
– రమేష్‌రాజు, ఆక్వా రైతు

రూప్‌చంద్ ధర పాతాళానికి

రూప్‌చంద్ ధర పాతాళానికి

రూప్‌చంద్ ధర పాతాళానికి