
బ్రహ్మాండం.. బ్రహ్మోత్సవం
బ్రహ్మోత్సవాల్లో నేడు
● తొలిరోజు వరుడైన శ్రీవారు
● రెండో రోజు నేత్రపర్వంగా ధ్వజారోహణం
● ప్రత్యేక అలంకారాల్లో స్వామివారి దర్శనం
ద్వారకాతిరుమల: శ్రీవారి ఆశ్వయుజమాస దివ్య బ్రహ్మోత్సవాలు దసరా పండుగ రోజు గురువారం ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా స్వామిని పెండ్లి కుమారుడు, అమ్మవార్లను పెండ్లి కుమార్తెలను చేయు వేడుక వైభవంగా జరిగింది. ముందుగా ఉత్సవమూర్తులను ఆలయం నుంచి తొళక్క వాహనంపై తీసుకెళ్లి, నిత్యకల్యాణ మండపంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక వేదికపై వేంచేపు చేశారు. ఆ తరువాత అర్చకులు సర్వాభరణ భూషితులైన శ్రీవారు, అమ్మవార్లకు బుగ్గన చుక్క, కల్యాణ తిలకాలను దిద్దారు. ఈ సందర్భంగా ఆలయ డీఈఓ భద్రాజీ, ఏఈఓ పి.నటరాజారావులు స్వామి, అమ్మవార్లకు పట్టు వస్త్రాలు, పూలు, పండ్లను సమర్పించారు. ఆ తరువాత పెండ్లి కుమారుడు, పెండ్లి కుమార్తెను చేసే వేడుకను అట్టహాసంగా నిర్వహించారు. ఆఖరిలో అర్చకులు, పండితులకు అధికారులు నూతన వస్త్రాలను అందజేశారు. తొలిరోజు స్వామివారు ఆలయ ముఖ మండపంలో శ్రీ మహావిష్ణువు అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు.
చరాచర సృష్టికి ఆహ్వానం..
బ్రహ్మోత్సవాల్లో రెండోరోజు శుక్రవారం రాత్రి ఆలయంలో ధ్వజారోహణ వేడుక వైభవంగా జరిగింది. ఉత్సవాలకు ఇంద్రాది అష్టదిక్పాలకులను, సర్వ దేవతలను, గంధర్వ, కిన్నెర, కింపురుషాది దేవగణాలను, సప్త అధోలోక జీవులను స్వాగతిస్తూ వేద మంత్రోచ్ఛరణలతో అర్చకులు ఆలయ ధ్వజస్తంభంపై గరుడ పటాన్ని ఎగురవేశారు. ఆ తరువాత గరుడ ప్రసాదాన్ని భక్తులకు, సంతానం లేని మహిళలకు అందించారు. అంతకు ముందు రుత్విగ్వరణ, మృద్గ్రహణ, అంకురార్పణ కార్యక్రమాలను జరిపారు. అంకురార్పణలో భాగంగా ఆలయ యాగశాలలో ఏర్పాటు చేసిన పాలికల్లో అర్చకులు పుట్టమన్నును ఉంచారు. ఆ తరువాత వాటిలో నవధాన్యాలను పోసి అంకురార్పణను నిర్వహించారు. రాత్రి హంస వాహనంపై గ్రామోత్సవం కనులపండువగా జరిగింది. ఆలయ ముఖ మండపంలో స్వామివారు మురళీకృష్ణ అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు.
ఉదయం 7 గంటల నుంచి సూర్యప్రభ వాహనంపై గ్రామోత్సవం
ఉదయం 8 గంటల నుంచి భజన కార్యక్రమాలు
ఉదయం 9 గంటల నుంచి భక్తిరంజని
ఉదయం 10 గంటల నుంచి కూచిపూడి భరతనాట్య ప్రదర్శనలు
సాయంత్రం 4 గంటల నుంచి నాదస్వరకచేరి
సాయంత్రం 5 గంటల నుంచి కూచిపూడి భరతనాట్య ప్రదర్శనలు.
రాత్రి 7 గంటల నుంచి చంద్రప్రభ వాహనాలపై గ్రామోత్సవం
ప్రత్యేక అలంకారం : సరస్వతి

బ్రహ్మాండం.. బ్రహ్మోత్సవం

బ్రహ్మాండం.. బ్రహ్మోత్సవం

బ్రహ్మాండం.. బ్రహ్మోత్సవం