
జంగారెడ్డిగూడెంలో దారుణ హత్య
జంగారెడ్డిగూడెం: పాత కక్షల నేపథ్యంలో పాత నేరస్తుడిని మరికొంతమంది పాత నేరస్తులు కలిసి హత్య చేశారు. పోలీసులు, స్థానికుల వివరాల ప్రకారం.. స్థానిక ఉప్పలమెట్టపై నివశిస్తున్న కర్రి రాజేష్ (25)ను శుక్రవారం మధ్యాహ్నం కొందరు వ్యక్తులు పిలవగా, వారిని చూసి రాజేష్ పారిపోయే ప్రయత్నం చేశాడు. దీంతో అతన్ని వెంబడించి బైక్‌పై ఎక్కించుకుని తీసుకెళ్లి కాళ్లు చేతులు కట్టేసి స్థానిక బైనేరు వాగు ఒడ్డున కత్తితో హత్య చేశారు. అతని భార్య నాగేశ్వరి మాట్లాడుతూ తన భర్త రాజేష్ ఇంట్లో ఉండగా, ఖాసిం, చోటులు వచ్చారని, వారిని చూసి రాజేష్ పారిపోగా, అతన్ని వెంబడించారని, అలాగే రెండు బైక్‌లపై వచ్చిన మరో ఇద్దరు, ముగ్గురు కూడా వెంబడించారన్నారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. జంగారెడ్డిగూడెం డీఎస్పీ యు.రవిచంద్ర, సీఐ ఎంవీ సుభాష్, ఎస్సై షేక్ జబీర్ సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. రాజేష్ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఏరియా ఆసుపత్రికి తరలించారు. కర్రి రాజేష్, షేక్ ఖాసిం, షేక్ నాగుల్‌మీరా, సంపంగి మంగరాజు, వాసంశెట్టి రామచంద్రపవన్, షేక్ జహీరుద్దీన్ అలియాస్ చోటు కలిసి దొంగతనాలు చేసేవారు. రాజేష్, షేక్ ఖాసింపై జంగారెడ్డిగూడెం పోలీస్ స్టేషన్‌లో సస్పెక్ట్ షీట్‌లున్నాయి. వీరిపై జంగారెడ్డిగూడెం, బుట్టాయగూడెం, తెలంగాణ రాష్ట్రంలోని పోలీస్‌స్టేషన్‌లలో పలు దొంగతనాల కేసులు ఉన్నాయి. దొంగతనాలకు సంబంధించి పంపకాల విషయంలో తేడా వచ్చిందని, వరంగల్ జిల్లాలో దొంగతనానికి సంబంధించి కర్రి రాజేష్, మిగిలిన వారి పేర్లు చెప్పాడనే కక్షతో ఈ హత్యకు పాల్పడినట్లు తెలిసింది. సుమారు నెల రోజులుగా రాజేష్‌ను హతమార్చేందుకు ప్రయత్నం చేస్తున్నట్లు తెలిసింది. మృతుడి సోదరుడు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి నిందితుల కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.

జంగారెడ్డిగూడెంలో దారుణ హత్య