
చీటీల పేరుతో మోసం
నూజివీడు: నూజివీడులోని ఎన్టీఆర్ కాలనీకి చెందిన శిరిగిరి వెంకటేశ్వరరావు అలియాస్ మోషే చీటీ పాటల పేరుతో 52 మంది నుంచి రూ.2.50 కోట్లు వసూలు చేసి మోసం చేశాడని పేర్కొంటూ బాధితులు శుక్రవారం పట్టణ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. నూజివీడుతో పాటు హనుమాన్‌జంక్షన్, ధర్మాజీగూడెం, బంటుమిల్లి, పెడన, చిల్లకల్లు, ప్రగడవరం, కుక్కునూరు, రామాపురం, కొత్తపల్లి గ్రామస్తుల దగ్గర బుడజంగాల సెక్రటరీ అంటూ మాయమాటలు చెప్పి చీటీపాటల పేరుతో మోసం చేశాడని ఫిర్యాదులో పేర్కొన్నారు. తమను నమ్మించి మోసం చేశాడని ఆవేదన వ్యక్తం చేశారు. చీటీ కడితే అవసరానికి ఉపయోగపడతాయని చెప్పి మోసం చేయడం దారుణమని, అతనికి నూజివీడులో రెండు బట్టల షాపులున్నాయని, మూడు ఇల్లు కట్టించాడని, ఇతర ఆస్తులున్నాయని, బంధువుల పేరుతో రిజిస్ట్రేషన్ చేసి ఐపీ నోటీసులు ఇచ్చాడని పేర్కొన్నారు.
చాట్రాయి: అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యాన్ని పట్టుకున్నట్లు సివిల్ సప్లయిస్ డీటీ వెంకటేశ్వరావు తెలిపారు. శుక్రవారం ఆయన విలేకర్లతో మాట్లాడుతూ మండలంలోని గుడిపాడు గ్రామానికి చెందిన ధనికొండ గోపిరాజు, కోట సురేష్ బాబు, తిరువూరుకు చెందిన చారి రేషన్ బియ్యం అక్రమంగా కొనుగోలు చేసి మండలంలోని గుడిపాడు నుంచి చనుబండ మీదుగా తిరువూరు తరలిస్తుండగా 40 క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని గురువారం రాత్రి పట్టుకున్నట్లు ఆయన చెప్పారు.