అయినవిల్లి: సహకార సంఘాల ధాన్యం కొనుగోలు కేంద్రాల ద్వారా రైతులకు బరకాలు సరఫరా చేస్తున్నట్లు జాయింట్ కలెక్టర్ టి.నిషాంతి తెలిపారు. మండలంలోని సిరిపల్లి రైతు సేవా కేంద్రంలో మంగళవారం నలుగురు రైతులకు ఆమె బరకాలు అందజేశారు. ఈ సందర్భంగా జేసీ మాట్లాడుతూ వర్షాల వల్ల పంటను కోల్పోకుండా కలెక్టర్ ఆదేశాలపై జిల్లా వ్యాప్తంగా బరకాలు అందిస్తున్నామన్నారు. అవసరమైన రైతులు పీఏసీఎస్‌ల ద్వారా బరకాలు తీసుకుని ఉపయోగించుకోవాలన్నారు. అవసరం తీరిన తర్వాత తిరిగి సహకార సంఘాలకు ఇచ్చేలా ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. జిల్లాలో 151 పీఏసీఎల్‌లకు పరిధిలో ఉన్న 221 క్లస్టర్లలో ధాన్యం కొనుగోలు చేయడం జరుగుతుందన్నారు. 65 పీఏసీఎస్‌లకు రూ.14.40 లక్షల విలువైన 800 బరకాలను కొనుగోలు చేసి అందించినట్టు తెలిపారు. రాష్ట్రంలో ప్రథమంగా మన జిల్లాలోనే బరకాలు అందించడం జరిగిందన్నారు. కార్యక్రమంలో జిల్లా సహకార అధికారి ఎస్.మురళీ కృష్ణ, సచివాలయ సిబ్బంది, రైతులు పాల్గొన్నారు.
03ఎఎంపీ101: రైతులకు బరకాలు అందజేస్తున్న జేసీ నిషాంతి


