గోద్రెజ్‌ చైర్మన్‌గా పిరోజ్‌షా | Pirojsha Godrej to be new chairperson of Godrej Industries | Sakshi
Sakshi News home page

గోద్రెజ్‌ చైర్మన్‌గా పిరోజ్‌షా

Apr 14 2026 5:54 AM | Updated on Apr 14 2026 5:54 AM

Pirojsha Godrej to be new chairperson of Godrej Industries

గోద్రెజ్‌ ఇండస్ట్రీస్‌ గ్రూప్‌ వెల్లడి 

నాదిర్‌ గోద్రెజ్‌ పదవీ విరమణ 

ముంబై: ప్రయివేట్‌ రంగ దిగ్గజం గోద్రెజ్‌ ఇండస్ట్రీస్‌ గ్రూప్‌ నాయకత్వ మార్పిడికి సన్నాహాలు ప్రారంభించింది. ప్రస్తుత చైర్‌పర్శన్, బంధువు నాదిర్‌ నుంచి ఈ ఏడాది ఆగస్ట్‌లో పిరోజ్‌షా గోద్రెజ్‌ బాధ్యతలు స్వీకరించనున్నారు. తదుపరి నాదిర్‌ గోద్రెజ్‌ కంపెనీ గౌరవ చైర్మన్‌గా సేవలు అందించనున్నట్లు గోద్రెజ్‌ ఇండస్ట్రీస్‌ గ్రూప్‌ పేర్కొంది. తరాలవారీ నాయకత్వ మార్పిడి ప్రణాళిక ప్రకారం ఇతర ఎంపికలు సైతం చేపట్టనున్నట్లు వెల్లడించింది. 

ఇది ఇటు అధికారం, అటు బాధ్యతల సమయమని పిరోజ్‌షా పేర్కొన్నారు. తరతరాలుగా నిర్మించుకున్న గ్రూప్‌ వారసత్వ సంపదతోపాటు విలువలను నిలుపుకుంటూనే ముందుకు సాగవలసి ఉంటుందని వ్యాఖ్యానించారు. 2026 ఆగస్ట్‌లో నాదిర్‌ వయసు 75ఏళ్లకు చేరనుండటంతో పదవీ విరమణ చేయనున్నారు. ఫలితంగా గ్రూప్‌లోని గోద్రెజ్‌ ఇండస్ట్రీస్, ఆగ్రోవెట్, కన్జూమర్‌ ప్రొడక్ట్స్‌సహా గోద్రెజ్‌ ప్రాపర్టీస్‌ బోర్డుల నుంచి తప్పుకోనున్నారు. సోమవారం(13) నుంచి ఆస్టెక్‌ లైఫ్‌సైన్సెస్‌ కంపెనీ చైర్మన్, నాన్‌ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ బాధ్యతలకు టాటా చెప్పారు.  

కొత్త తరంతో.. 
తదుపరి తరం నాయకత్వంలో గోద్రెజ్‌ గ్రూప్‌ మరింత పటిష్ట వృద్ధిని అందుకోనున్నట్లు ఈ సందర్భంగా నాదిర్‌ విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. గోద్రెజ్‌ గ్రూప్‌నకు పలు దశాబ్దాలుగా నాదిర్‌ సేవలు అందిస్తున్న విషయం విదితమే. నాదిర్‌ సోదరుడు ఆది, పరమేశ్వర్‌ గోద్రెజ్‌ కుమారుడు పిరోజ్‌షా గోద్రెజ్‌ ఆగస్ట్‌ 14 నుంచి గోద్రెజ్‌ ఇండస్ట్రీస్‌ గ్రూప్, గోద్రెజ్‌ ఇండస్ట్రీస్‌కు చైర్‌పర్శన్‌గా బాధ్యతలు చేపట్టనున్నారు. 

గోద్రెజ్‌ ఆగ్రోవెట్‌ చైర్మన్‌గా నాదిర్‌ కుమారుడు బుర్జీస్‌ గోద్రెజ్‌ ఆగస్ట్‌ 14న బాధ్యతలు స్వీకరించడంతోపాటు.. గోద్రెజ్‌ ఇండస్ట్రీస్‌ బోర్డులో నాన్‌ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌గా చేరనున్నారు. ఆస్టెక్‌ లైఫ్‌సైన్సెస్‌ ఎండీ పదవి నుంచి వెనువెంటనే తప్పుకుని బోర్డులో నాన్‌ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌గా కొనసాగనున్నారు. ఆస్టెక్‌ లైఫ్‌ చైర్‌పర్శన్‌గా గోద్రెజ్‌ కెమికల్స్‌ సీఈవో విశాల్‌ శర్మ వెనువెంటనే బాధ్యతలు స్వీకరించనున్నారు. ఆస్టెక్‌ లైఫ్‌ ప్రస్తుత సీవోవో ఆరిజిత్‌ ముఖర్జీ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌గా ఎంపికయ్యారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement