
న్యూఢిల్లీ: వ్యక్తిగత జీవిత బీమా, ఆరోగ్య బీమా పాలసీలకు వస్తు, సేవల పన్ను (జీఎస్‌టీ) నుంచి మినహాయింపునివ్వాలని కేంద్రం ప్రతిపాదించింది. దీనిపై దాదాపు అన్ని రాష్ట్రాలు సానుకూలంగా స్పందించాయి. బీమాపై వివిధ రాష్ట్రాల మంత్రులతో ఏర్పాటైన 13 సభ్యుల బృందం (జీవోఎం) ఈ ప్రతిపాదనపై చర్చించింది. జీఎస్‌టీ రేట్ల కోత ప్రయోజనాలు కంపెనీలకు కాకుండా కస్టమర్లకు బదిలీ అయ్యేలా తగు విధానాన్ని రూపొందించాలని జీఎస్‌టీ కౌన్సిల్‌ను కోరినట్లు తెలంగాణ డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క తెలిపారు.
వ్యక్తిగత బీమా పాలసీలకు జీఎస్‌టీ నుంచి మినహాయింపునివ్వడం వల్ల ఏటా రూ. 9,700 కోట్ల నష్టం వాటిల్లుతుందని అంచనాలు ఉన్నాయని వివరించారు. మంత్రుల అభిప్రాయాలు, అభ్యంతరాలను పొందుపర్చిన నివేదికను జీఎస్‌టీ కౌన్సిల్‌కి సమర్పించనున్నట్లు బీమాపై జీవోఎం కన్వీనరు, బిహార్ డిప్యుటీ సీఎం సామ్రాట్ చౌదరి తెలిపారు. అక్టోబర్ ఆఖరు నాటికి జీవోఎం తుది నివేదిక సమర్పించనుంది. ప్రస్తుతం ఆరోగ్య, జీవిత బీమా ప్రీమియంలపై 18 శాతం జీఎస్‌టీ వర్తిస్తోంది. 2023–24లో కేంద్రం, రాష్ట్రాలు హెల్త్ ఇన్సూరెన్స్ ప్రీమియంపై రూ. 8,263 కోట్లు, హెల్త్ రీఇన్సూరెన్స్ ప్రీమియంపై రూ. 1,484 కోట్లు జీఎస్‌టీ రూపంలో సమీకరించాయి.