
రోడ్డు ప్రమాదంలో యువకుడి మృతి
మంగళగిరి టౌన్: రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి చెందిన ఘటన మంగళగిరిలో చోటుచేసుకుంది. సేకరించిన వివరాల మేరకు.. విజయవాడ, ఇబ్రహీంపట్నం ప్రాంతానికి చెందిన ముదిగొండ వెంకట ప్రమీల తన కుమారుడు వెంకట సురేంద్ర (18)తో కలసి ద్విచక్రవాహనంపై గుంటూరులోని బంధువుల ఇంటికి సోమవారం వెళ్లారు. తిరిగి వచ్చే క్రమంలో మంగళగిరి ఆత్మకూరు జాతీయ రహదారిపై గుర్తుతెలియని వాహనం ఢీకొట్టింది. దీంతో ఇద్దరికీ తీవ్ర గాయాలు అయ్యాయి. సురేంద్ర అక్కడికక్కడే మృతి చెందాడు. స్థానికులు 108కు సమాచారం ఇవ్వడంతో ప్రమీలను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఘటనా స్థలానికి చేరుకున్న మంగళగిరి రూరల్ పోలీసులు పోస్టుమార్టం నిమిత్తం సురేంద్ర మృతదేహాన్ని ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై రూరల్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.