
గుర్తు తెలియని వాహనం ఢీకొని వ్యక్తి మృతి
మంగళగిరి టౌన్: గుర్తుతెలియని వాహనం ఢీకొని ఓ వ్యక్తి అక్కడికక్కడే దుర్మరణం చెందిన ఘటన మంగళగిరి పట్టణంలో చోటుచేసుకుంది. పట్టణ ఎస్‌ఐ రవీంద్రనాయక్ తెలిపిన వివరాల ప్రకారం.. ఆదివారం అర్ధరాత్రి సమయంలో గుర్తుతెలియని వ్యక్తి గుంటూరు, విజయవాడ జాతీయ రహదారిపై శ్రీ లక్ష్మీ నరసింహస్వామి కాలనీ సమీపంలో రోడ్డు దాటుతుండగా వాహనం ఢీకొట్టింది. ఈ ఘటనలో వ్యక్తికి తీవ్ర గాయాలు కావడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. సమాచారం అందుకున్న పట్టణ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని మంగళగిరి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతుడి వయస్సు 25–30 మధ్య ఉంటుందని, శరీరంపై ఎరుపురంగు టీ షర్ట్, నలుపురంగు ప్యాంటు ఉన్నాయని పోలీసులు తెలిపారు. ఇతర వివరాలు తెలియరాలేదని పేర్కొన్నారు. సమాచారం తెలిసిన వారు 86888 31559 నంబరులో సంప్రదించాలని విజ్ఞప్తి చేశారు.