
11న 98 డీఎస్సీ టీచర్ల సభకు తరలిరండి
గుంటూరు ఎడ్యుకేషన్: విజయవాడలోని ధర్నా చౌక్‌లో ఈ నెల 11వ తేదీన తలపెట్టిన 1998–డీఎస్సీ ఎంటీఎస్ ఉపాధ్యాయుల రాష్ట్రస్థాయి విజ్ఞాపన సభకు తరలిరావాలని గుంటూరు జిల్లా 98 ఎంటీఎస్ టీచర్ల మహిళా విభాగ అధ్యక్షురాలు శారద, శౌరీలమ్మ, ధనలక్ష్మి, పార్వతి, రూత్‌బస్లీనాలు సోమవారం ఓ ప్రకటనలో తెలిపారు. తమ సేవలను క్రమబద్ధీకరించి, ఉద్యోగ విరమణ వయసు 60 నుంచి 62 ఏళ్లకు పెంచాలని కోరారు. రిటైర్ అయినవారికి రూ.20 వేల పింఛన్ అందించాలని డిమాండ్ చేశారు. పలు డిమాండ్లతో చేపడుతున్న సభకు ఉపాధ్యాయులు పెద్దసంఖ్యలో హాజరు కావాలని పిలుపునిచ్చారు.
మోతడక(తాడికొండ): ద్విచక్ర వాహనం ఢీకొని వృద్ధుడు మృతి చెందిన ఘటన తాడికొండ మండలం మోతడక గ్రామంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మోతడక గ్రామానికి చెందిన కొమ్మినేని సాంబశివరావు (67) ఆదివారం సాయంత్రం సచివాలయం సెంటర్‌లో రోడ్డు దాటుతున్నాడు. అమరావతి వైపు నుంచి వస్తున్న ద్విచక్ర వాహనం వేగంగా అతడిని ఢీకొట్టింది. తలకు బలమైన గాయం కావడంతో వెంటనే జీజీహెచ్‌కు తరలించారు. అప్పటికే అతడు మరణించినట్లు వైద్యులు తెలిపారు. మృతుడి కుమారుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ కె.వాసు తెలిపారు.
వినుకొండ: పల్నాడు జిల్లా వినుకొండ రూరల్ మండలం ఏనుగుపాలెం గ్రామంలో యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు. వివరాల్లోకి వెళితే.. గ్రామానికి చెందిన గుంటూరు శివ (35)ను గుర్తుతెలియని వ్యక్తులు గ్రామ సమీప పొలాల్లో గడ్డపారతో పొడిచి హత్య చేసినట్లు సోమవారం గుర్తించారు. స్థానిక రైతులు ఇచ్చిన సమాచారంతో నరసరావుపేట డీఎస్పీ హనుమంతరావు, ఇన్‌చార్జి సీఐ బాలాజీ సంఘటనా ప్రాంతానికి చేరుకొని మృతదేహాన్ని పరిశీలించి విచారణ చేపట్టారు. హత్యపై విచారణ చేస్తున్నామని, త్వరలోనే పూర్తి వివరాలు వెల్లడిస్తామని డీఎస్పీ తెలిపారు. మృతుడికి భార్య సుధతో పాటు ఇద్దరు పిల్లలు ఉన్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
కొరిటెపాడు (గుంటూరు): బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావం వల్ల గుంటూరు జిల్లా వ్యాప్తంగా తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురుస్తున్నాయి. ఆదివారం ఉదయం నుంచి సోమవారం ఉదయం వరకు అత్యధికంగా గుంటూరు పశ్చిమలో 49.6, అత్యల్పంగా వట్టిచెరుకూరు మండలంలో 1 మి.మీ. వర్షపాతం నమోదైంది. సగటు 16.5 మి.మీ.గా కురిసింది. వివిధ మండలాల్లో నమోదైన వర్షపాతం వివరాలు.. తెనాలి మండలంలో 47.2, మంగళగిరి 42.4, గుంటూరు తూర్పు 42.2, పెదనందిపాడు 15.2, పొన్నూరు 15, దుగ్గిరాల 13.8, కాకుమాను 12.4, ఫిరంగిపురం 9.8, తుళ్ళూరు 8.4, పెదకాకాని 8, తాడేపల్లి 6.2, తాడికొండ 6.2, ప్రత్తిపాడు 6, చేబ్రోలు 5.4, కొల్లిపర 5.2, మేడికొండూరు మండలంలో 2.2 మి.మీ. చొప్పున వర్షపాతం కురిసింది.