
గ్రామీణ నీటి సరఫరా వ్యవస్థ బలోపేతం లక్ష్యం
జిల్లా కలెక్టర్ వి.వినోద్‌కుమార్ ప్రజలకు శుద్ధ జలాలు అందించేలా అధికారులు చర్యలు తీసుకోవాలి
బాపట్ల: గ్రామీణ ప్రాంతాల ప్రజలకు శుద్ధ జలాలు సరఫరా చేసేలా ఇంజినీరింగ్ అధికారులకు స్పష్టమైన ప్రణాళిక ఉండాలని జిల్లా కలెక్టర్ వి. వినోద్ కుమార్ తెలిపారు. జల సంరక్షణ ప్రణాళికపై స్థానిక విస్తరణ శిక్షణ కేంద్రంలో నాలుగు జిల్లాల ఆర్‌డబ్ల్యూఎస్ ఇంజినీరింగ్ అధికారులకు ఏర్పాటు చేసిన మూడు రోజుల శిక్షణ కార్యక్రమాన్ని కలెక్టర్ సోమవారం ప్రారంభించారు. ప్రారంభ సూచికగా జ్యోతిని వెలిగించారు. గాంధీజీ, అంబేడ్కర్ చిత్రపటాలకు ఆయన పూలమాలలతో ఘనంగా నివాళులర్పించారు. అనంతరం మాట్లాడుతూ గ్రామాల అభివృద్ధి ప్రజల భాగస్వామ్యంతోనే సాధ్యమని తెలిపారు. జల వనరుల సంరక్షణ, అభివృద్ధిలోనూ ప్రజల సహకారం ఉండాలన్నారు. గ్రామాల అభివృద్ధిలో మహిళల పాత్ర కీలకమని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన అధునాతన సాంకేతికత పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకోవాలని ఇంజినీర్లకు ఆయన సూచించారు. గ్రామాల్లో తాగునీటి సమస్య శాశ్వత పరిష్కారానికి సమగ్ర ప్రణాళిక రూపొందించాలని ఆదేశించారు. గ్రామీణ నీటి సరఫరా వ్యవస్థను బలోపేతం చేయాలని చెప్పారు. ప్రభుత్వ విధులను ఇష్టంతో, సంతోషంగా నిర్వర్తించాలని ఆయన తెలిపారు. జల జీవన్ మిషన్ పనులు పక్కాగా చేపట్టాలని, పారిశుద్ధ్యానికి అధిక ప్రాధాన్యత ఇవ్వాలని ఆదేశించారు. ఆర్‌డబ్ల్యూఎస్ చీఫ్ ఇంజినీర్ సత్యనారాయణ మాట్లాడుతూ జల వనరుల సుస్థిరాభివృద్ధి, తాగునీరు నిరంతర సరఫరా లక్ష్యంతో అధికారులు పని చేయాలని తెలిపారు. జీవన్ మిషన్ పనులు 2028 సంవత్సరం వరకు పొడిగిస్తూ కేంద్రం అధికారికంగా అనుమతులు ఇచ్చిందన్నారు. భవిష్యత్తులో తాగునీటి సమస్యను అరికట్టడానికి ప్రణాళికలు రూపొందించుకోవాలని చెప్పారు. ప్రజల భాగస్వామ్యంతో ప్రణాళికలు రూపొందించి అమలు చేయడం వల్ల మంచి ఫలితాలు వస్తాయని సూచించారు. జలజీవన్ మిషన్, స్వచ్ఛభారత్ కార్యక్రమాలను గ్రామాల్లో విరివిగా చేపట్టాలని ఆయన తెలిపారు. కార్యక్రమంలో విశ్రాంత పర్యవేక్షణ ఇంజినీర్ రాఘవులు, ఆర్‌డబ్ల్యూఎస్ ఎస్‌ఈ అనంతరాజు, డీపీఓ ప్రభాకర్‌రావు, విస్తరణ శిక్షణ కేంద్రం ప్రధానాచార్యులు డి. వెంకటరావు పాల్గొన్నారు.
పార్క్‌లను అభివృద్ధి చేయాలి
బాపట్ల: ప్రజలకు ఆహ్లాదకరమైన వాతావరణం కలిగించేలా పట్టణంలో పార్క్‌లను అభివృద్ధి చేయాలని కలెక్టర్ వి.వినోద్ కుమార్ సూచించారు. సోమవారం రాత్రి పట్టణంలోని వివేకానంద కాలనీలో గల మున్సిపల్ పార్క్‌లో జరుగుతున్న అభివృద్ధి పనులను కమిషనర్ జి.రఘునాథరెడ్డితో కలసి పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ పార్క్‌ను ఈ నెల 20న ప్రారంభోత్సవం చేయాలని, ఈలోగా వేగవంతంగా పనులు పూర్తి చేయాలని ఆదేశించారు. ప్రతి ఆదివారం పిల్లలు పార్కుకు వచ్చే విధంగా అభివృద్ధి చేయాలని సూచించారు. పిల్లలకు సంబంధించిన ఆట వస్తువులు, పరికరాలను ఏర్పాటు చేయాలని చెప్పారు. పిల్లలతో పాటు వచ్చే పెద్దలు పార్కులో వాకింగ్ చేసే విధంగా ట్రాక్ ఏర్పాటు చేయాలని తెలిపారు. యువతకు ఉపయోగపడే జిమ్ పరికరాలను కూడా సిద్ధం చేయాలని ఆదేశించారు. నగరంలో ప్రతి వార్డులో పార్క్ ఉండే విధంగా ప్రణాళికలు సిద్ధం చేయాలని చెప్పారు. దీని కోసం పట్టణ పరిధిలో ప్రభుత్వ భూములను పరిశీలించాలని ఆర్డీఓను, తహసీల్దార్‌ను కలెక్టర్ ఆదేశించారు.ఆయన వెంట ఆర్డీఓ పి.గ్లోరియా, తహసీల్దార్ శాలీమా, మున్సిపల్ డీఈ సిబ్బంది ఉన్నారు.

గ్రామీణ నీటి సరఫరా వ్యవస్థ బలోపేతం లక్ష్యం