
‘ఎకో టూరిజం’ ప్రతిపాదన విరమించాలి
అరకులోయ టౌన్: మాడగడ సన్‌రైజ్ వ్యూ పాయింట్ వద్ద ఎకో టూరిజం ప్రాజెక్టు ప్రతిపాదనను అటవీశాఖ విరమించాలని మాడగడ పంచాయతీ ప్రజలు విన్నవించారు. ఆదివారం సన్‌రైజ్ వ్యూపాయింట్ వద్ద పంచాయతీ పరిధిలోని వివిధ రంగాల కళాకారులు, ఉపాధి పొందుతున్న వారు శాంతియుతంగా నిరసన తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వ్యూపాయింట్ స్థలం అటవీశాఖకు చెందినది కాదన్నారు. మాడగడ గ్రామానికి చెందిన నలుగురు గిరిజన రైతులకు 12 ఎకరాల మేర గతంలో డిఫారం పట్టాలు ఇచ్చిఉన్నారని పీసీ కమిటీ కార్యదర్శి బి.సుమన్, మోటార్ యూనియన్ ప్రతినిధులు రామకృష్ణ, డి.చిన్నబాబు తెలిపారు. ఆ స్థలంపై డీఫారం రైతులకు సర్వ హక్కులు ఉన్నప్పుడు అటవీశాఖ అధికారులు ఇబ్బందులకు గురిచేయడంలో ఆంతర్యమేంటని ఆవేదన వ్యక్తం చేశారు. కర్రలతో ఏర్పాటు చేసిన ఊయల, థింసా నృత్యం వద్ద ఏర్పాటు చేసిన పందిరి రాటలను ఏ రకంగా తొలగిస్తారని ప్రశ్నించారు. సన్‌రైజ్ వ్యూపాయింట్‌పై నాలుగేళ్లుగా ఆధారపడి జీవనం సాగిస్తున్న ఆదివాసీలను ఉన్నట్టుండి ఇబ్బందులకు గురిచేయడం సరికాదన్నారు. వ్యూపాయింట్‌పై ఆధారపడి జీవనం సాగిస్తున్న తమ పొట్ట కొట్టడం అన్యాయమన్నారు. గత మూడేళ్లలో మాడగడ వ్యూపాయింట్ అభివృద్ధిని అటవీశాఖ ఎందుకు పట్టించుకోలేదని వారు ధ్వజమెత్తారు. ఇప్పటికైనా అటవీశాఖ అధికారులు మాడగడ వ్యూపాయింట్ జోలికి రావద్దని విన్నవించారు.
మాడగడ సన్ రైజ్ వ్యూపాయింట్‌పరిసర గ్రామాల ప్రజల విన్నపం