
కుప్పకూలిన పాఠశాల భవనం
● సెలవురోజు కావడంతో
తప్పిన పెనుముప్పు
● భారీ వర్షానికి రెండు చోట్ల ఘటన
జి.మాడుగుల: భారీ వర్షాలకు మండలంలో పాలమామిడి పంచాయతీ వనభరంగిపాడులో ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల(జీపీఎస్) భవనం గురువారం తెల్లవారుజామున కుప్పకూలిపోయింది. ఇక్కడ 37 మంది విద్యార్థులు చదువుతున్నారు. పాఠశాల నిర్వహణ సమయంలో భవనం కూలితే పెద్ద ప్రమాదం సంభవించేదని, ఇది ఊహించుకుంటేనే ఒళ్లు జలదరిస్తుందని గ్రామస్తులు ఆందోళన చెందారు. దసరా సెలవుల కారణంగా విద్యార్థులు ఎవరూ పాఠశాలలో లేకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పిందని స్థానికులు చెప్పారు. వనభరంగిపాడు గ్రామంలో వర్షానికి నేలకూలిన పాఠశాల భవనాన్ని సర్పంచ్ సురభంగి రామకృష్ణ, ఎంపీటీసీ గెమ్మెలి అప్పారావు, మాజీ సర్పంచ్ భాస్కరరావు పరిశీలించారు. తక్షణమే భవన నిర్మాణానికి చర్యలు తీసుకోవాలని వారు కోరారు.
సింధుపుట్టులో పాఠశాల రేకులషెడ్డు..
ముంచంగిపుట్టు: ఈదురుగాలులతో కూడిన వర్షానికి మండలంలోని జర్జుల పంచాయతీ సింధుపుట్టులో పాఠశాల నిర్వహించే రేకులషెడ్డు కూలిపోయింది. ఈ ఘటన సెలవు రోజు గురువారం సాయంత్రం జరగడం వల్ల పెనుముప్పు తప్పింది. సింధిపుట్టు జీసీపీఎస్ ట్రైబల్ వెల్ఫేర్ పాఠశాలను తాత్కాలిక రేకుల షెడ్డులో నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో గురువారం సాయంత్రం కురిసిన భారీ వర్షానికి నేలమట్టమైంది. శుక్రవారం పాఠశాలకు వచ్చిన విద్యార్థులు గుర్తించారు. వెంటనే తల్లిదండ్రులకు తెలియజేయడంతో వారు విద్యాశాఖ అధికారులకు తెలియజేశారు. సీఆర్‌పీ గౌరీశంకర్ సింధిపుట్టు వెళ్లి పాఠశాల పరిప్థితిని గమనించారు. ప్రస్తుతం పాఠశాల నిర్వహణపై గ్రామస్తులతో చర్చించారు. నూతన భవనానికి ప్రతిపాదనలు పంపామని సీఆర్పీ వివరించారు. తక్షణమే భవనం నిర్మించి విద్యార్థులకు వసతి సమస్య పరిష్కరించాలని ఉప సర్పంచ్ సాధురాం, స్థానికులు కోరారు.

కుప్పకూలిన పాఠశాల భవనం