
‘స్థానిక’ ఎన్నికలపై ఉత్కంఠ
సాక్షి,ఆదిలాబాద్: స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి రాష్ట్ర ఎన్నికల కమిషన్ నుంచి గత నెలలో షెడ్యూల్ జారీ అయ్యింది. సాధారణంగా షెడ్యూల్ ప్రకటన తర్వాత క్షేత్రస్థాయిలో రాజకీయాలు వేడెక్కాలి. అయితే బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల అంశంపై హైకోర్టులో విచారణ నేపథ్యంలో ఎన్నికలు ఇ ప్పుడు ప్రకటించిన రిజర్వేషన్ల ఆధారంగానే జరుగుతాయా.. లేనిపక్షంలో పరిణామాలు ఎలా ఉంటాయని రాజకీయ పార్టీలతో పాటు ఆశావహులు, ప్రజలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. బుధవారం రాష్ట్ర ప్రధాన న్యాయస్థానంలోఈ విచారణ సాగను న్న నేపథ్యంలో అందరి దృష్టి అటువైపే నెలకొంది.
గత నెలలో షెడ్యూల్..
సెప్టెంబర్ 29న స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి షెడ్యూల్ జారీ అయిన విషయం తెలిసిందే. పరిషత్ ఎన్నికలు రెండు విడతల్లో, గ్రామపంచాయతీ ఎన్నికలు మూడు విడతల్లో నిర్వహించేలా అందులో ప్రకటించారు. పరిషత్ మొదటి విడత ఎన్నికల నోటిఫికేషన్ గురువారం రావాల్సి ఉంది. అయితే బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల విషయంలో హైకోర్టులో బుధవారం విచారణ సాగనుంది. ఈ నేపథ్యంలో న్యాయస్థానం స్పందనపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.
రిజర్వేషన్లు నిలిచేనా..?
ఆదిలాబాద్ జెడ్పీ చైర్‌పర్సన్ రిజర్వేషన్ జనరల్ (మహిళ)కు కేటాయించిన విషయం తెలిసిందే. అలాగే జిల్లాలో 20 పరిషత్ స్థానాలకు గాను 8 ఎస్టీ, 8 బీసీ, 2 జనరల్, 2 ఎస్సీలకు రిజర్వేషన్ ఖరారయ్యాయి. ఇందులో సగం స్థానాలను మహిళలకు కేటాయించారు. అలాగే ఎంపీపీ, ఎంపీటీసీ, సర్పంచ్‌ల రిజర్వేషన్ల ఖరారు సైతం ఇప్పటికే పూర్తయింది. హైకోర్టు తీర్పు తర్వాత రోజే గురువారం పరిషత్ ఎన్నికలకు సంబంధించి మొదటి నోటిఫికేషన్ జారీ చేయాల్సి ఉంది. అయితే గ్రామాల్లో ఇప్పటివరకు ఈ ఎన్నికలకు సంబంధించి వేడి కనబడటం లేదు. రాజకీయ పార్టీలు కూడా వేచి చూసే ధోరణిలో న్యాయస్థానం తీర్పు ఎలా ఉంటుందోనని ఆసక్తిగా గమనిస్తున్నారు.