నారీ.. బీమారి పరారీ | - | Sakshi
Sakshi News home page

నారీ.. బీమారి పరారీ

Oct 6 2025 2:46 AM | Updated on Oct 6 2025 10:21 AM

నారీ.. బీమారి పరారీ

నారీ.. బీమారి పరారీ

ఆదిలాబాద్‌టౌన్‌: మహిళల ఆరోగ్యంపై దృష్టి సారించిన ప్రభుత్వం స్వస్థ్‌ నారీ సశక్త్‌ పరివార్‌ అభియాన్‌ కార్యక్రమాన్ని చేపట్టిన విషయం తెలిసిందే. జిల్లాలో ఈ కార్యక్రమం సత్ఫలితాలనిచ్చింది. గతనెల 17 నుంచి అక్టోబర్‌ 2 వరకు జిల్లాలోని ప్రభుత్వ ఆస్పత్రుల్లో మహిళలకు వైద్య పరీక్షలు చేశారు. రోగాలను గుర్తించి అవసరమైన మందులు పంపిణీ చేశారు. శస్త్ర చికిత్సల నిమిత్తం పలువురిని రిమ్స్‌కు రిఫర్‌ చేశారు. రిమ్స్‌తో పాటు ఉట్నూర్‌ జిల్లా ఆస్పత్రిలో ఉన్న వైద్య నిపుణులతో జిల్లాలోని ఆయా పీహెచ్‌సీలు, ఏరియా ఆస్పత్రులు, పట్టణ ఆరోగ్య కేంద్రాలు, బస్తీ దవాఖానాల్లో పరీక్షలు నిర్వహించారు. దాదాపు పక్షం రోజుల పాటు 209 క్యాంపులను ఏర్పాటు చేశారు. వేలాది మంది మహిళలకు స్క్రీనింగ్‌ చేశారు. ఈఎన్‌టీ, కంటి పరీక్షలు, రక్తపోటు, డయాబెటీస్‌, దంత పరీక్షలు, నోటి, రొమ్ము, గర్భాశయ క్యాన్సర్‌, గర్భిణులకు రక్తహీనత పరీక్షలతో పాటు పిల్లలకు పీడియాట్రిక్‌ సేవలు అందించారు. అలాగే చర్మ వ్యాధులు, పల్మనాలజీ, సైకియాట్రి, క్షయవ్యాధి స్క్రీనింగ్‌, వయోవృద్ధులకు ఆరోగ్య పరీక్షతో పాటు వివిధ రకాల సేవలు అందించారు. ఆరోగ్య నియమాలు, పోషకాహార ఆవశ్యకతను వివరించారు. శిబిరాల్లో పలు రోగాలు నిర్ధారణ అయిన వారిపై ప్రత్యేక దృష్టి సారించనున్నట్లు వైద్యారోగ్య శాఖ అధికారులు చెబుతున్నారు.

విశేష స్పందన..
స్వస్థ్‌ నారీ సశక్త్‌ పరివార్‌ అభియాన్‌ కార్యక్రమానికి విశేష స్పందన లభించింది. జిల్లాలోని 22 ప్రాథమిక ఆరోగ్యకేంద్రాలు, 2 బస్తీ దవాఖానాలు, 67 పల్లె దవాఖానాలు, బోథ్‌ ఏరియా ఆస్పత్రితో పాటు 5 పట్టణ ఆరోగ్య కేంద్రాల్లో ఈ శిబిరాలను మహిళల కోసం ఏర్పాటు చేశారు. పిల్లలకు సంబంధించి పీడియాట్రిక్‌ వైద్యులు 25 క్యాంపులు, గైనిక్‌కు సంబంధించి 33, జనరల్‌ మెడిసిన్‌ 23, జనరల్‌ సర్జరీ 13, డెంటల్‌ 18, పల్మనాలజీ 17, ఈఎన్‌టీ 19, ఆప్తమాలజీ 23, ఆర్థో 15, డర్మటాలజీ 19, సైకియాట్రిస్ట్‌కు సంబంధించి 4, మొత్తం 209 క్యాంపులు నిర్వహించారు. ఇందులో కాళ్ల నొప్పులకు సంబంధించి 27,167 మహిళలకు, బీపీకి సంబంధించి 17,552, డయాబెటిస్‌కు సంబంధించి 16,780, క్యాన్సర్‌కు సంబంధించి 10,771మంది, అలాగే 1,714 మంది గర్భిణులకు వైద్య పరీక్షలు చేశారు. ఎనీమియాకు సంబంధించి 9,938 మందికి, మహిళలతో పాటు 814 మంది ఆడపిల్లలకు వివిధ రకాల టీకాలు వేశారు. 10,552 మందికి ఎనీమియాకు సంబంధించి రక్త పరీక్షలు నిర్వహించారు. యువతులు, మహిళలకు వ్యక్తిగత పరిశుభ్రత, ఆరోగ్యంపై అవగాహన కల్పించారు. 10,742 మందికి టీబీ పరీక్షలు చేపట్టారు. క్షయ వ్యాధిగ్రస్తులకు ఫుడ్‌ కిట్లు ఇచ్చేందుకు 376 మంది మహిళలు ముందుకొచ్చారు. సికిల్‌సెల్‌తో బాధపడుతున్న 665 మందికి వైద్య పరీక్షలు చేశారు. దీంతోపాటు ఇతర రుగ్మతలతో బాధపడుతున్న 325 మందికి చికిత్స అందించారు. ఈ కార్యక్రమం ఆయా గ్రామాలు, మండల కేంద్రాల్లో నిర్వహించడంతో మహిళలు ముందుకు వచ్చి వైద్య పరీక్షలు చేయించుకున్నారు.

పకడ్బందీగా చేపట్టాం..
జిల్లాలో స్వస్థ్‌ నారీ సశక్త్‌ పరివార్‌ అభియాన్‌ కార్యక్రమాన్ని పకడ్బందీగా చేపట్టాం. అన్ని ప్రభుత్వ ఆస్పత్రుల్లో మహిళలకు ప్రత్యేక వైద్యనిపుణులతో పరీక్షలు నిర్వహించాం. వ్యాధి నిర్ధారణ అయిన వారికి మందులు పంపిణీ చేశాం. 50 మందికి కంటిశుక్లాలు ఉన్నట్లు గుర్తించాం. వారికి ఆపరేషన్‌కు ఏర్పాట్లు చేస్తున్నాం. అలాగే వివిధ రుగ్మతలతో బాధపడుతున్న మహిళలపై ప్రత్యేక దృష్టి సారించాం.

– రాథోడ్‌ నరేందర్‌, డీఎంహెచ్‌వో

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement