మత్తడివాగు కుడికాలువ పనులు పూర్తి ఏడాదైనా ప్రారంభానికి నోచుకోని వైనం ప్రభుత్వం త్వరగా స్పందించాలని రైతుల వేడుకోలు
తాంసి: మండలంలోని మత్తడివాగు ప్రాజెక్టు కుడికాలువ నిర్మాణ పనులు పూర్తయి ఏడాది దాటినా ఆయకట్టు రైతులకు సాగునీరందని పరిస్థితి. పనులు పూర్తవడంతో అధికారులు ట్రయల్‌రన్ సైతం నిర్వహించారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఏడాది క్రితం జిల్లా పర్యటన సందర్భంగా దీనిని ప్రారంభిస్తారని అధికారులు ఏర్పాట్లు చేశారు. అయితే సీఎం పర్యటన వాయిదా పడటంతో ఆ ప్రక్రియకు బ్రేక్ పడింది.
రూ.7.34 కోట్లతో పనులు
తాంసి మండలంలోని వడ్డాడి సమీపంలో రైతులకు సాగునీరు అందించాలనే ఉద్దేశంతో 20 ఏళ్ల క్రితం మత్తడివాగు ప్రాజెక్టు పనులు చేపట్టారు. 2008లో ప్రాజెక్టును ప్రారంభించారు. ఎడమకాలువ ద్వారా ప్రస్తుతం 8500 ఎకరాలకు సాగునీరు అందుతుంది. నిర్మాణ సమయంలో కుడికాలువ పనులు చేపట్టలేదు. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తరువాత ఈ నిర్మాణానికి అధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేశారు. నూతన సాంకేతికతో పైపులైన్ ద్వారా భూసేకరణ సమస్య లేకుండా వడ్డాడి, హస్నాపూర్, ఖోడద్, పొన్నారి శివారు రైతులకు నీటిని అందించాలని నిర్ణయించారు. 1200 ఎకరాల ఆయకట్టు లక్ష్యంగా 2017లో రూ.7.34 కోట్లను ప్రభుత్వం మంజూరు చేసింది. ఈ మేరకు గుత్తేదారు పనులను ఏడాది క్రితం పూర్తి చేశారు. ట్రయల్‌రన్ సైతం సక్సెస్ కావడంతో పోయిన సంవత్సరం రబీ నుంచి సాగు నీరు అందుతుందని రైతులు ఆశపడ్డారు. అయితే ఇప్పటికీ ప్రారంభానికి నోచుకోకపోవడం గమనార్హం.
పైపులైన్ ద్వారా చేలకు నీరు
కుడి కాలువ వద్ద పంప్‌హౌస్ నిర్మాణం చేపట్టి అందులో మోటార్లను ఏర్పాటు చేశారు. అక్కడి నుంచి భూగర్భ పైపులైన్ ద్వారా చేలకు నీరు అందేలా పనులు పూర్తి చేశారు. మొత్తం 9 కిలోమీటర్ల మేర ప్రధాన పైపులైన్‌తో పాటు 25 బ్లాక్‌లను ఏర్పాటు చేశారు. ప్రతీ బ్లాక్‌కు ఐదు ఆటోమెటిక్ వాల్వ్‌లను ఐదెకరాలకు ఒకటి చొప్పున బిగించారు. నీటి వృథా అరికట్టేందుకు చర్యలు చేపట్టారు. అయితే ఏడాదైనా ప్రారంభానికి నోచుకోని పరిస్థితి. ఇప్పటికై నా ఉన్నతాధికారులు స్పందించి తగు చర్యలు చేపట్టాలని రైతులు కోరుతున్నారు.
నవంబర్ నుంచి అందించేలా చర్యలు
ప్రాజెక్టు కుడికాలువ పైపులైన్ పూర్తి కావడంతో పాటు ట్రయల్ రన్ సైతం నిర్వహించాం. కుడి కాలువను అధికారికంగా ప్రారంభించకపోయినా ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు రైతులకు వచ్చే నవంబర్ నుంచి నీటిని అందించేలా చర్యలు తీసుకుంటున్నాం.
– హరీశ్‌కుమార్, మత్తడివాగు ప్రాజెక్టు ఏఈ
వెంటనే సాగు నీరందించాలి
ప్రాజెక్టు కుడికాలువ లేక ఏళ్లుగా ఎదురుచూశాం. ఇప్పుడు పనులు పూర్తయినా ప్రారంభానికి నోచుకోక సాగునీరందని పరిస్థితి. దీంతో రబీలో పంటలు వేయలేకపోతున్నాం. ఇప్పటికై నా ప్రభుత్వం స్పందించి త్వరగా సాగునీరందించే చర్యలు చేపట్టాలని కోరుతున్నాం.
– బాగిడి కిష్టయ్య రైతు వడ్డాడి గ్రామం
సాగు నీరందేదెప్పుడో?
సాగు నీరందేదెప్పుడో?