
శిశు మరణాలు తగ్గించేందుకు చర్యలు
ఆదిలాబాద్‌టౌన్: నవజాత శిశు మరణాలు తగ్గించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని కలెక్టర్ రాజర్షిషా అన్నారు. శనివారం రిమ్స్ ఆస్పత్రిని తనిఖీ చేశారు. పలు వార్డులను పరిశీలించారు. బాలింతలు, రోగులతో మాట్లాడి వైద్యసేవల వివరాలు అడిగి తెలుసుకున్నారు. నాణ్యమైన చికిత్స అందించాలని వైద్యులకు సూచించారు. 28 రోజుల లోపు పసికందుల మరణాలు సంభవించకుండా చర్యలు చేపట్టాలన్నారు. మరుగుదొడ్లను పరిశుభ్రంగా ఉండేలా చూడాలని సిబ్బందిని ఆదేశించారు. అనంతరం ఆసుపత్రి ఆవరణలోని మూడు మెడికల్ షాపులతో పాటు విజయ డెయిరీ పార్లర్‌ను తనిఖీ చేశారు. రికార్డులు సరిగా లేకపోవడంతో మెడికల్ సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మరోసారి పునరావృతమైతే షాపులను రద్దు చేస్తామని హెచ్చరించారు. ఆస్పత్రిలో అందుబాటులో లేని మందులను మాత్రమే మెడికల్ షాపుల ద్వారా విక్రయించాలన్నారు. కలెక్టర్ వెంట డీఎంహెచ్‌వో నరేందర్ రాథోడ్, రిమ్స్ డైరెక్టర్ జైసింగ్ రాథోడ్, డిప్యూటీ డీఎంహెచ్‌వో సాధన, వైద్యులు అనంత్‌రావు తదితరులు ఉన్నారు.
విజయ డెయిరీ పార్లర్‌కు జరిమానా
రిమ్స్ ఆవరణలో కొనసాగుతున్న విజయ డెయిరీ పార్లర్‌కు మున్సిపల్ కమిషనర్ సీవీఎన్ రాజు జరి మానా విధించారు. కలెక్టర్ ఆదేశాల మేరకు షాపును ఆయన పరిశీలించారు. డెయిరీలో ఇతర వస్తువులు అమ్మడం, అధిక ధరలకు విక్రయాలు జ రపడం, వస్తువులపై ఉన్న ఎమ్మార్పీ కనిపించకుండా మార్కర్‌తో దిద్దడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ వస్తువులను స్వాధీనం చేసుకున్నారు. రూ. వెయ్యి జరిమానా విధించారు. మరోసారి పునరా వృతమైతే షాపును సీజ్ చేస్తామని హెచ్చరించారు.
భోరజ్ మండలంలో పంట నష్టం పరిశీలన..
సాత్నాల: ఇటీవల కురిసిన భారీ వర్షాలతో భోరజ్ మండలంలో దెబ్బతిన్న పంటలను కలెక్టర్ రాజర్షి షా శనివారం పరిశీలించారు. పెండల్‌వాడ, శాంగ్వి గ్రామాలను సందర్శించి బాధిత రైతులతో మాట్లాడారు. పంట నష్టం వివరాలు అడిగి తెలుసుకున్నారు. బాధితులందరికీ పరిహారం అందేలా చర్యలు తీసుకుంటామన్నారు. ఆయన వెంట జిల్లా వ్యవసాయ అధికారి శ్రీధర్ స్వామి, ఎంపీడీవో మహేశ్‌కుమార్, ఏవో పూజ, ఏఈవో సుజాత, రైతులు ఉన్నారు.