
‘స్లాట్’తోనే పత్తి కొనుగోళ్లు
ఈ ఏడాది సీసీఐ కొత్త నిబంధనలు
అక్రమాలకు చెక్ పెట్టేలా ‘కిసాన్ కపాస్’ అమలు
6న ఏఈవోలకు అవగాహన
ఈనెల 20 తర్వాతే విక్రయాలు
ఆదిలాబాద్‌టౌన్: పత్తి కొనుగోళ్లకు సంబంధించి కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ) కొత్త నిబంధనలు తీసుకొచ్చింది. రైతులు స్లాట్ బుకింగ్ చేసుకుంటేనే మార్కెట్ యార్డులో విక్రయాలు జరిపేలా చర్యలు చేపట్టింది. దీంతో దళారులు, మధ్యవర్తుల అక్రమాలకు చెక్ పడనుంది. అలాగే రైతులకు గంటల తరబడి నిరీక్షణ తప్పనుంది. ఈ మేరకు వ్యవసాయ, మార్కెటింగ్ శాఖ అధికారులు దీనిపై అవగాహన కల్పించేలా ప్రణాళికలు రూపొందించారు. ఈనెల 6న జిల్లాలోని ఏఈవోలకు శిక్షణ కల్పించనున్నారు. వీరు ఆయా గ్రామాల్లో రైతులకు యాప్ డౌన్‌లోడ్, స్లాట్ బుకింగ్‌పై వివరించనున్నారు. అయితే స్లాట్ బుకింగ్ ద్వారా పత్తి కొనుగోళ్లు ఏ మేరకు జరుగుతాయనేది చూడాల్సి ఉంది.
కిసాన్ కపాస్ యాప్..
కేంద్ర ప్రభుత్వం కిసాన్ కపాస్ యాప్‌ను గతేడాది ప్రవేశపెట్టింది. అయితే ఇది పూర్తిస్థాయిలోకి అమలులోకి రాలేదు. ఈసారి ఖచ్చితంగా అమలు చేసేందుకు అధికారులు చర్యలు చేపడుతున్నారు. ఈ యాప్‌లో రైతులు ముందుగా తమ వివరాలు నమోదు చేసుకోవాలి. తద్వారా మండలాలు మ్యాపింగ్, షెడ్యూల్ ప్రకారం కొనుగోళ్లు ఉంటాయి. పత్తి విక్రయించే సమయంలో స్లాట్ బుకింగ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆ ప్రకారం అధికారులు అంచనా వేసిన దిగుబడి మేరకే కొనుగోలు చేస్తారు. ఒకసారి ఎంత పత్తి వస్తుందో అంతే అమ్ముకోవడానికి అవకాశం కల్పిస్తారు. దీంతో రైతులకు ఇబ్బందులు తలెత్తే అవకాశం లేకపోలేదు. జిల్లాలో ప్రస్తుతం వ్యవసాయ అధికారులు క్రాప్ బుకింగ్ వివరాలు నమోదు చేస్తున్నారు.
మధ్యవర్తుల దోపిడీకి చెక్..
రైతులు పత్తి విక్రయించాలంటే మధ్యవర్తుల దోపిడీ గురించి చెప్పాల్సిన అవసరం లేదు. ఇలాంటి వాటికి చెక్ పెట్టేందుకు సీసీఐ ‘కపాస్ కిసాన్’ యాప్‌ను అందుబాటులోకి తెచ్చింది. ఈ యాప్ ద్వారా నేరుగా రైతులు స్లాట్ బుకింగ్ చేసుకొని పంట విక్రయించేందుకు అవకాశం కల్పించింది. కొంత మంది వ్యాపారులు, దళారులు ఇతర రైతుల పేరిట సీసీఐకి పత్తి విక్రయించి లబ్ధి పొందుతున్నారు. అలాంటి వాటికి ఇక చెక్ పడనుంది. ఎకరానికి ఎంత దిగుబడి వస్తుందో.. ఆ మేరకు మాత్రమే కొనుగోలు చేయనున్నారు. గతేడాది జిల్లాలో కొంత మంది దళారులు రైతుల పేరిట ఎక్కువ మొత్తంలో సీసీఐకి పత్తి విక్రయించినట్లు తేలింది. దీంతో వ్యవసాయ, మార్కెటింగ్ అధికారులపై వేటు పడిన విషయం తెలిసిందే.
యాప్‌లో వివరాల నమోదు ఇలా..
రైతులు పంట అమ్ముకునేందుకు సాగుకు సంబంధించిన పూర్తి వివరాలు నమోదు చేసి స్లాట్ బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. గూగుల్ ప్లే స్టోర్ నుచి యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోవాలి. ఆ తర్వాత రైతు పేరు, జెండర్, పుట్టిన తేది, కులం, చిరునామా, ఆధార్, మొబైల్ నంబర్ నమోదు చేసుకోవాలి. అనంతరం పంట వివరాలు తెలియజేయాలి. సొంత భూమి, కౌలుదారా అనేది వివరించాలి. పట్టాదారు పాస్ పుస్తకం నంబర్, సర్వే నంబర్, మొత్తం భూమి, పత్తి సాగు విస్తీర్ణం, పంట రకం లాంటి వివరాలతో పాటు రైతు ఫొటోను అప్‌లోడ్ చేయాల్సి ఉంటుంది.
జిల్లాలో
మొత్తం సాగు విస్తీర్ణం 5.83 లక్షల ఎకరాలు
పత్తి సాగు విస్తీర్ణం 4.28 లక్షల ఎకరాలు
గతేడాది సీసీఐ కొనుగోలు చేసిన పత్తి
25 లక్షల క్వింటాళ్లు
ప్రైవేట్ వ్యాపారులు కొనుగోలు చేసింది
2.50 లక్షల క్వింటాళ్లు
ఈ ఏడాది పత్తి దిగుబడి అంచనా
30 లక్షల క్వింటాళ్లు