
అసాంఘిక చర్యలకు పాల్పడవద్దు
ఇచ్చోడ: అసాంఘిక చర్యలకు పాల్పడవద్దని ఎస్పీ అఖిల్‌మహాజన్ సూచించారు. గురువారం ఉద యం 5గంటలకు మండలంలోని కేశవపట్నంలో పోలీసులు కార్డన్ సెర్చ్ నిర్వహించగా ఎస్పీ భారీ వర్షంలోనూ గ్రామాన్ని సందర్శించారు. గ్రామస్తులతో మాట్లాడి సమస్యలు తెలుసుకున్నారు. గత ఐదేళ్లలో గ్రామానికి చెందిన పలువురిపై 90 కేసులు నమోదైనట్లు తెలిపారు. కలప స్మగ్లింగ్, పీడీ యాక్ట్, రౌడీ షీట్‌లు నమోదైన వారు అసాంఘిక కార్యకలాపాలకు దూరంగా ఉండి సత్ప్రవర్తనతో మెదిలితే కేసులు ఎత్తివేసే దిశగా కృషి చేస్తామని తెలిపారు. చదువుకోలేక కొన్నేళ్లుగా ఇక్కడి ముల్తానీలు అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్నారని, ఐదేళ్లున్న పిల్లలందరినీ పాఠశాలలకు పంపించాలని పేర్కొన్నారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికలను ప్రశాంత వాతావరణంలో నిర్వహించుకోవాలని సూచించారు. గ్రామంలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకుని పోలీస్‌శాఖకు సహకరించాలని కోరారు.
పత్రాలు లేని వాహనాలు స్వాధీనం
కేశవపట్నం గ్రామంలో నిర్వహించిన కార్డన్ సెర్చ్‌లో భాగంగా పోలీసులు ఇంటింటా తనిఖీలు నిర్వహించారు. సరైన ధ్రువపత్రాలులేని 82 ద్విచక్రవాహనాలు, 18 ఆటోలు, ఒక మ్యాక్స్ వాహనం స్వాధీనం చేసుకున్నారు. ఉట్నూర్ అడిషనల్ ఎస్పీ కాజల్‌సింగ్, ఆదిలాబాద్ డీఎస్సీ జీవన్‌రెడ్డి, స్పెషల్ బ్రాంచ్ డీఎస్పీ శ్రీనివాస్, ఇచ్చోడ, ఉట్నూర్ సీఐలు రాజు, ప్రసాద్, ఇచ్చోడ, ఇంద్రవెల్లి, గుడిహత్నూర్, నేరడిగొండ, సిరికొండ ఎస్సైలు పురుషోత్తం, సాయన్న, శ్రీకాంత్, ఇమ్రాన్, పూజ, స్పెషల్ బ్రాంచ్ ఎస్సై అన్వర్ ఉల్ హక్, 180మంది పోలీసులు, 20 మంది మహిళా పోలీసులు పాల్గొన్నారు.

అసాంఘిక చర్యలకు పాల్పడవద్దు