
బతుకమ్మ బతుకుదెరువైంది
దేవీ నవరాత్రులు, బతుకమ్మ పండుగకు పూలకు భలే డిమాండ్ పట్టణంలో సందడిగా మారిన పూల మార్కెట్లు
నిర్మల్‌ఖిల్లా: బతుకమ్మ పండుగ అంటే కేవలం మహిళల పండుగ మాత్రమే కాదు. ఇది రైతుల నుంచి వ్యాపారుల దాకా అన్ని వర్గాలకూ ఉపాధి కల్పించే పండుగ. పూలు, బట్టలు, అలంకరణ వస్తువులు, మాంసం, డీజే సౌండ్ సిస్టమ్స్ ఇలా ప్రతీ రంగంలోనూ ఈ పండుగ ఆర్థిక ప్రోత్సాహాన్ని తెచ్చిపెడుతోంది. ప్రతీ సంవత్సరం మాదిరి బతుకమ్మ, దేవీ నవరాత్రుల నేపథ్యంలో ఈసారికూడా జిల్లాలో ఉత్సాహం ఊపందుకుంటోంది. పూలవ్యాపారుల నుంచి మొదలుకుని వస్త్ర దుకాణాలు, షాపింగ్‌మాల్స్, డీజే సౌండ్ సిస్టమ్‌ల యజమానుల వరకు అన్ని రంగాల వారికి ఉపాధి కల్పించేలా బతుకమ్మ పండగ నిజంగానే బతుకుదెరువుగా మారుతోంది.
మామడ మండలం తాండ్ర శివారులో చామంతి పూల సాగు
పూలకూ గిరాకీ ఫుల్...
మామడ మండలంలోని కొండ ప్రాంతమైన తాండ్ర గ్రామంలో యువ రైతు మనోజ్ తనకున్న నాలుగెకరాల్లో ఒక ఎకరం చామంతి పూలు సాగు చేస్తున్నాడు. ప్రస్తుతం దుర్గాదేవి శరన్నవరాత్రులు, బతుకమ్మ వేడుకల నేపథ్యంలో చామంతి పూలకు డిమాండ్ ఎక్కువగా ఉంది. నాలుగు నెలలపాటు కష్టపడితే పంట చేతికి వచ్చిందని చెబుతున్నాడు. వ్యవసాయంతో పాటు చామంతి పూల సాగును చేపట్టిన మనోజ్ పండగ నేపథ్యంలో ప్రయోజనం ఉందని పేర్కొంటున్నాడు..