
పిడుగుపాటుకు గేదెల కాపరి..
నిర్మల్‌టౌన్: మండలంలోని తల్వేద గ్రామానికి చెందిన సాకలి పోశెట్టి(52) పిడుగుపాటుకు మృతిచెందాడు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. పోశెట్టి గేదెలు కాస్తూ జీవనం సాగిస్తుంటాడు. మంగళవారం మంజులాపూర్ పెద్దచెరువు సమీపంలో గేదెలు మోపుతున్నాడు. సాయంత్రం కురిసిన వర్షానికి పిడుగుపాటుకు గురై అక్కడికక్కడే మృతిచెందాడు. రాత్రి ఇంటికి రాకపోవడంతో కుటుంబ సభ్యులు గాలించగా.. బుధవారం నీటిమడుగులో విగత జీవిగా కనిపించాడు. మృతుడికి భార్య, ఇద్దరు కుమారులు, ఇద్దరు కూతుళ్లు ఉన్నారు.
ఆస్పత్రికి వెళ్లివస్తూ
అనంతలోకాలకు..
ఉట్నూర్‌రూరల్: కుటుంబ సభ్యులకు ఆరోగ్యం బాగా లేదని ఆస్పత్రికి వెళ్లివస్తుండగా జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందారు. బాధిత కుటుంబ సభ్యులు, స్థానికులు తెలిపిన వివరాల మేరకు ఉట్నూర్ మండలంలోని శంకర్ నాయక్ తండాకు చెందిన జాదవ్ బలిరాం(73)మంగళవారం సాయంత్రం కుటుంబ సభ్యులకు ఆరోగ్యం బాగా లేకపోవడంతో బైక్‌పై హస్నాపూర్ తీసుకెళ్లాడు. తిరుగుప్రయాణంలో గ్రామ సమీపంలోకి రాగానే గుర్తుతెలియని వాహనం ఢీకొట్టడంతో తీవ్ర గాయాలయ్యాయి. ఉట్నూర్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా వైద్యుల సూచన మేరకు రిమ్స్‌కు రెఫర్ చేశారు. పరీక్షించిన వైద్యులు హైదరాబాద్‌కు రెఫర్ చేశారు. తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందాడు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్సై ప్రవీణ్ తెలిపారు.
గడ్డెన్నవాగు కాలువలోపడి ఒకరు మృతి
లోకేశ్వరం: మండలంలోని పుస్పూర్ గ్రామ సమీపంలో ఉన్న గడ్డెన్నవాగు ప్రాజెక్టు కాలువలోపడి ఒకరు మృతి చెందినట్లు ఎస్సై అశోక్ తెలిపారు. బిహార్‌లోని ముధపర్‌నగర్‌కు చెందిన వినోద్ సహాని (35) ఉపాధి నిమిత్తం జిల్లాకు వచ్చి మండలంలోని రాజేశ్‌తండా సమీపంలోని రైస్‌మిల్లులో హమాలీ పనిచేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. మంగళవారం రాత్రి ముఖఃదం గులాబ్ సహానితో కలిసి పుస్పూర్‌లో మద్యం సేవించాడు. ఇంటికి వెళ్లే క్రమంలో ప్రమాదవశాత్తు పుస్పూర్ గ్రామ శివారులోని గడ్డెన్న వాగు ప్రాజెక్టు కాలువలో పడిపోవడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుని పెదనాన్న కుమారుడైన రాజ్‌గిర్ సహాని ఫిర్యాదు మేరకు బుధవారం కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్సై తెలిపారు.

పిడుగుపాటుకు గేదెల కాపరి..