
రివర్ రాఫ్టింగ్ కేంద్రంగా ‘పొచ్చెర’!
బోథ్: పర్యాటక రంగంలో కొత్త అధ్యయనానికి నాంది పలుకుతూ బోథ్ మండలంలోని సుందరమైన పొచ్చెర జలపాతం ఇప్పుడు రివర్ రాఫ్టింగ్ కేంద్రంగా మారనుంది. తాజాగా ఈ జలపాతం వద్ద ఇటీవల కోయానా అడ్వంచర్ టీమ్ విజయవంతంగా నిర్వహించిన ట్రయల్ దీనికి మరింత బలం చేకూర్చింది. నీటి ప్రవాహం ఎక్కువగా ఉండే నదుల్లో రివర్ రాఫ్టింగ్ నిర్వహిస్తారు. పర్యాటకులు, సాహస క్రీడల్లో భాగంగా ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన గాలితో కూడిన పడవల్లో హెల్మెట్‌లు, ప్రత్యేక జాకెట్‌లు ధరించి దీనిని చేస్తుంటారు. అయితే మన దేశంలో పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో ఇప్పటికే అనేకచోట్ల రాఫ్టింగ్‌కు అనుమతులిచ్చారు. దీంతో అక్కడ పర్యాటక రంగాలు అభివృద్ధిలో ఉన్నాయి. పొచ్చెర జలపాతం దిగువ నుంచి పారుతున్న నీటిలో సాహసోపేతంగా మొదటగా ఆరు కిలోమీటర్ల మేర కుప్టి వరకు రాఫ్టింగ్ నిర్వహించారు. ఈ ట్రయల్ రన్ విజయవంతమైందని నిర్వాహకులు తెలిపారు. జలపాతం పరిసరాల్లోని ప్రవాహాలు ఇందుకు ఎంతగానో అనుకూలంగా ఉన్నట్లు పేర్కొన్నారు. రెండు వైపులా ఎత్తైన కొండ ప్రాంతం, మధ్యలో వాగు ప్రవాహంతో ఎంతో ఆకట్టుకునేలా ఉందని వారు తెలిపారు. పొచ్చెర జలపాతాన్ని పర్యాటక ప్రాంతంగా మరింత అభివృద్ధి చేసేందుకు, ప్రత్యేకించి సాహస క్రీడాప్రియులను ఆకర్షించేందుకు ఇది ఎంతగానో తోడ్పడుతుంది.
నేడు అధికారుల బృందం రాక
జిల్లా పర్యాటక ప్రోత్సాహక మండలి (డీటీపీసీ) చై ర్మన్‌గా ఉన్న కలెక్టర్ రాజార్షి షాతో పాటు పలువు రు అధికారుల బృందం సోమవారం పొచ్చెర జలపాతాన్ని సందర్శించనున్నారు. పొచ్చెరలో పర్యాటక ప్రాంతాలను పర్యవేక్షించిన అనంతరం జలపాతం కింది భాగం నుంచి కుప్టి వరకు రివర్ రాఫ్టింగ్‌కు గల అవకాశాలను క్షుణ్ణంగా పరిశీలించనున్నారు. రాఫ్టింగ్‌కు అవసరమైన భద్రత ప్రమాణాలు, వసతులు, ఇతర అంశాలపై ఈ బృందం ఒక నివేదిక తయారు చేయనుంది.
అనుమతులొస్తే పర్యాటకానికి ఊతం
పొచ్చెర జలపాతం వద్ద రివర్ రాఫ్టింగ్‌కు డీటీపీసీ నుంచి అనుమతులు లభిస్తే ఈ ప్రాంతం పర్యాట కంగా అభివృద్ధి చెందే ఆస్కారముంది. దీంతో త్వ రలోనే పొచ్చెర జలపాతం అధికారికంగా ఒక రివర్ రాఫ్టింగ్ జోన్‌గా ప్రకటించబడే అవకాశముంది. అనుమతి లభిస్తే ఈ ప్రాంత పర్యాటకానికి మరింత ఊతమివ్వడమే కాకుండా, స్థానిక ఆర్థిక వ్యవస్థకు కూడా మేలు చేస్తుందని అధికారులు భావిస్తున్నా రు. పొచ్చెర జలపాతం ఇకపై చూడదగిన ప్రదేశమే కాకుండా, సాహస క్రీడలకు అనువైన ప్రదేశంగానూ ప్రసిద్ధి చెందవచ్చని తెలిపారు. రివర్ రాఫ్టింగ్ వర్షాకాలం చివరలో, చలికాలంలో నిర్వహించే అవకాశమున్నట్లు అధికారులు పేర్కొంటున్నారు.