
వామ్మో పెద్దపులి!
బోథ్: సొనాల మండలంలోని ఘన్‌పూర్, వజ్జర్ అడవుల్లో పెద్దపులి సంచరిస్తోంది. ఈ నెల 19న దేవుల్‌నాయక్ తండా గ్రామానికి చెందిన రాథోడ్ గోవింద్ ఎద్దును హతమార్చింది. ప్రస్తుతం ఈ అడవుల్లోనే సంచరిస్తున్నట్లు తెలుస్తోంది. పెద్దపులిని ట్రాప్ చేసేందుకు అటవీశాఖ అధికారులు కెమెరాలు అమర్చారు. ఎద్దును పులి హతమార్చిన ప్రదేశానికి ఎవరూ వెళ్లవద్దని అటవీశాఖ అధికారి ప్రణ య్ సూచించారు. అయితే ఆదివాసీ గ్రామాల్లోని ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. కాగా, తిప్పేశ్వర్ అడవుల్లో నుంచి ఘన్‌పూర్ మీదుగా తెలంగాణకు పెద్దపులి వచ్చి వెళ్తోంది. ఈ ఏడాది జూన్‌లో బోథ్ మండలంలోని నారాయణపూర్, రఘునాథ్‌పూర్ ప్రాంతాల్లో సంచరించింది. గతేడాది నవంబర్‌లో వజ్జర్, చింతగూడ, మర్లపెల్లి, నిగిని ప్రాంతాల్లో తిరిగింది. మొత్తంగా ఏడాదిలో మూడుసార్లు పెద్దపులి బోఽథ్, సొనాల మండలాలకు వచ్చింది. అటవీ విస్తీర్ణం పెరగడంతో పెద్దపులికి ఆవాసానికి అనుకూలంగా ఉండగా తరచూ వస్తున్నట్లు తెలుస్తోంది. అయితే అటవీ ప్రాంతంలోకి ఎవరూ వెళ్లవద్దని అధికారులు అటవీ సమీప గ్రామాల ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు.

వామ్మో పెద్దపులి!