
గుండెపోటుతో కాంట్రాక్టు కార్మికుడి మృతి
కాసిపేట: మండలంలోని దేవాపూర్ ఓరియంట్ సి మెంటు కంపెనీ కాంట్రాక్టు కార్మికుడు రేణికుంట శంకరయ్య(53) శుక్రవారం గుండెపోటుతో మృతిచెందాడు. దేవాపూర్ ఎస్సై గంగారాం తెలిపిన వివరాల ప్రకారం.. కంపెనీ పరిధిలోని క్వార్టర్లలో పనికి వెళ్లిన శంకరయ్య ఉదయం 10.30గంటలకు చాతిలో నొప్పి వస్తుందని చెప్పడంతో తోటి కార్మికులు కంపెనీ డిస్పెన్సరీకి తీసుకెళ్లారు. వైద్యుల సూచన మేరకు మంచిర్యాలకు తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతిచెందాడు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. కాగా, మృతుడి కుటుంబానికి న్యాయం చేయాలని కుటుంబ సభ్యులు, స్థానిక నాయకులు ఆందోళనకు సిద్ధమయ్యారు. రూ.20లక్షల నష్టపరిహారం, కుటుంబంలో ఒక్కరికి ఉద్యోగం ఇవ్వాలని డిమాండ్ చేశారు. మృతదేహన్ని కంపెనీ గేటు ముందుకు తీసుకువచ్చి ఆందోళన చేయనున్నట్లు తెలుసుకున్న పోలీసులు ముందస్తుగా మంచిర్యాలకు చేరుకుని నివారించారు. మానవత కోణంలో రూ.లక్ష వరకు ఖర్చుల నిమిత్తం సహాయం అందిస్తామని, ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తామని కంపెనీ అధికారులు తెలిపినట్లు సమాచారం. మృతదేహం పోస్టుమార్టం అనంతరం శనివారం గ్రామానికి చేరనుండడంతో శుక్రవారం ఆందోళనలు నిర్వహించలేదు.