ఆశావహ సేద్యం!

 Asha practices zero budget natural farming - Sakshi

రసాయనిక వ్యవసాయానికి పెట్టింది పేరైన హర్యానా రాష్ట్రంలో ఆశా వంటి ప్రకృతి వ్యవసాయదారులు అరుదుగా కనిపిస్తారు. ఆశ తన కుటుంబ సభ్యులు, కూలీల సహకారంతో గత పదేళ్లుగా ప్రకృతి వ్యవసాయం చేస్తున్నారు. రసాయనిక ఎరువులు, పురుగుమందులు వాడకుండా పండ్ల తోటలు, పంటలు సాగు చేస్తానంటే వాళ్ల ఇంట్లో వాళ్లే ఎగతాళి చేశారు. అయినా, ఆశా వెనకంజ వెయ్యలేదు.

జిల్లా కేంద్రం చర్కి–దద్రి జిల్లా కేంద్రానికి 25 కిలోమీటర్ల దూరంలో పిచొంప కలన్‌ గ్రామం ఆమెది. 3,200 గడప ఉంటుంది. ఆశా, ఆమె కోడలు జ్యోతితోపాటు ఆ ఊళ్లో ప్రకృతి వ్యవసాయం చేస్తున్న రైతులు చాలా కొద్దిమంది మాత్రమే. వాళ్లకు మూడెకరాల భూమి ఉంది. అందులో నారింజ, నిమ్మ, బత్తాయి చెట్లతో కూడిన పండ్ల తోటను సాగు చేస్తున్నారు. పరస్పరం పోటీ పడని సీజనల్‌ పంటలను అంతర పంటలుగా సాగు చేయడం ప్రకృతి వ్యవసాయంలో ఓ ముఖ్య సూత్రం. ఆశా ఆ సూత్రాన్ని పాటిస్తున్నారు. పాలకూర, మెంతికూర, శనగలు, సజ్జలు, గోధుమలను కూడా అంతరపంటలుగా సాగు చేస్తూ ఉత్తమ రైతుగా ఆశా పేరు గడించారు. అదే తోటలో సీతాఫలం మొక్కలను కూడా నాటాలని ఆమె అనుకుంటున్నారు. తొలుత రెండేళ్ల పాటు సాధారణ దిగుబడితో పోల్చితే 40 శాతం మేరకే దిగుబడి వచ్చిందని, అయినా మక్కువతో ప్రారంభించిన ప్రకృతి వ్యవసాయాన్ని కొనసాగించి, ఇప్పుడు మంచి దిగుబడులు పొందుతున్నానని ఆశా తెలిపారు.

ఏ రోజైనా ఇంటిపనులు చేసుకున్న తర్వాత ఉదయం, సాయంత్రం తోటలోకి వెళ్లి పనులు స్వయంగా చేసుకోవడం ఆశాకు, ఆమె కోడలికి అలవాటు. ప్రతిరోజూ శ్రద్ధగా తోటను గమనించుకుంటూ.. ఎక్కడైనా చీడపీడల జాడ కనిపిస్తే వెంటనే కషాయాలు, ద్రావణాలు పిచికారీ చేసి అదుపు చేయడం ముఖ్యమైన సంగతి అని ఆశ అంటున్నారు. గొయ్యిలో పాతిపెట్టిన మట్టి పాత్రలో పుల్లమజ్జిగ ఎప్పుడూ సిద్ధంగా ఉంటుంది. చీడపీడలకు దాన్ని నీటిలో కలిపి పిచికారీ చేస్తారు. ఔషధ చెట్ల నుంచి సేకరించిన జిగురుకు నిప్పు అంటించి తోటలో పొగబెట్టడం ద్వారా చీడపీడలను సంప్రదాయ పద్ధతిలో ఆశా పారదోలుతున్నారు. ‘పంటలు పూత దశలో మా బామ్మ ఇలాగే చేసేది’ అంటున్నారామె.

ప్రతి రెండు నెలలకోసారి ద్రవ జీవామృతాన్ని తోటకు అందిస్తూ భూసారాన్ని పెంపొందిస్తున్నారు. వర్మీకంపోస్టును సైతం తయారు చేసి పంటలకు వాడుతున్నారు. అందుబాటులో ఉన్న వనరులను ఉపయోగించుకొని ఎరువులు, పురుగుమందులను తయారు చేసుకుంటున్నారు. బయట ఏవీ కొనడం లేదు. బోరు నీటిని స్ప్రింక్లర్లు, డ్రిప్‌ ద్వారా పంటలకు అందిస్తున్నారు. ‘ఈ తరహా ప్రకృతి వ్యవసాయంలో పెట్టుబడి చాలా తక్కువే. అయితే, కష్టపడి పనిచేయాల్సి ఉంటుంది’ అంటున్నారు ఆశా కోడలు జ్యోతి.

సతత్‌ సంపద అనే స్వచ్ఛందసంస్థ హర్యానా, ఉత్తరప్రదేశ్‌లో రైతులకు సుస్థిర వ్యవసాయ పద్ధతులను పరిచయం చేస్తూ ఉంటుంది. ఆశకు ఈ సంస్థ తోడ్పాటునందించింది. సతత్‌ సంపద డైరెక్టర్‌ జ్యోతి అవస్థి ఇలా అంటున్నారు.. ‘భూమిలో డీఏపీ, యూరియా వెయ్యకుండా పంటలు ఎలా పండుతాయి? అని రైతులు మమ్మల్ని ప్రశ్నిస్తూ ఉంటారు. భూమిలో సారం పెరగడానికి రెండేళ్లు పడుతుంది. అందుకే ప్రకృతి వ్యవసాయం మొదలు పెట్టిన తొలి రెండేళ్లలో దిగుబడి తక్కువగా ఉంటుంది. ఎంతో మక్కువతో ప్రారంభించిన ఆశ వంటి రైతులు తట్టుకొని నిలబడగలరు. కానీ, మరీ చిన్న రైతులు దీనికి తట్టుకోలేరు. అందుకే మేం ఈ రైతులతో పనిచేస్తున్నాం. మార్పు నెమ్మదిగా వస్తుంది..’.

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top