ఆప్కో ఆన్‌లైన్‌లో అందుకో

AP Government Provides International Market For Weavers Through Online Marketing - Sakshi

కులవృత్తిని మించిన ఉపాధి మరొకటి ఉండదనే మనదేశపు వృత్తికారుల ధైర్యాన్ని వలస పాలకులు తుడిచి పెట్టేశారు. పట్టెడన్నం పెట్టడం లేదని మగ్గం కొయ్యనే ఉరికొయ్య చేసుకున్నారు చేనేతకారులు. మంచి రోజులు రాకపోతాయా అనే ఆశతో తాత్కాలికంగా మగ్గాన్ని పక్కన పెట్టి చేత వచ్చిన పనులతో పొట్ట నింపుకుంటున్నారు.

ఖద్దరుకు మారు పేరయిన శ్రీకాకుళం జిల్లా పొందూరులోనైతే మగ్గాన్ని వదిలి కంపెనీల్లో గుమాస్తాలుగా, జూట్‌ మిల్లులో కార్మికులుగా, తాపీ పని వాళ్లుగా, హోటళ్లలో పని వాళ్లుగా మారిపోయిన వాళ్లెందరో. ఇక ఆ పరిస్థితి ఉండబోదు. ఆన్‌లైన్‌ మార్కెటింగ్‌ ద్వారా నేటి నుంచి మన చేనేతలకు అంతర్జాతీయ మార్కెట్‌ను కల్పిస్తోంది ఏపీ ప్రభుత్వం.

ఏపీ చేనేత కారులు నేసిన వస్త్రాలు ఇక నుంచి ఆన్‌లైన్‌ మార్కెట్‌ దిగ్గజాలైన అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌ల ద్వారా వినియోగదారుల అరచేతిలో ఉన్న స్మార్ట్‌ ఫోన్‌లో దర్శనమిస్తాయి. చేనేతరంగాన్ని బలోపేతం చేయడానికి తీసుకున్న ఈ నిర్ణయం సాంస్కృతిక పునరుజ్జీవనానికి ఏపీ ప్రభుత్వం వేసిన మరొక ముందడుగు. మరుగున పడడానికి సిద్ధంగా ఉన్న భారతీయ కుటీర పరిశ్రమలను పునరుద్ధరించడానికి చేస్తున్న చిత్తశుద్ధిగల ప్రయత్నమిది.  శ్రీకాకుళం జిల్లాకే వస్తే.. చేనేతకు ఎంత దూరమైనా సరే అటకెక్కని మగ్గాలు పొందూరులో ఐదు వందల యాభై వరకు ఉన్నాయి.

కుటుంబానికి ఇద్దరు లెక్కన పదకొండు వందల మంది మగ్గాన్ని నమ్ముకుని జీవిస్తున్నారు. ఇప్పుడున్న అరకొర మార్కెట్‌  కారణంగా భార్యాభర్త ఇద్దరూ నెలంతా కష్టపడినప్పటికీ వాళ్లకు మిగిలేది ఏడెనిమిది వేలే. ఇక పట్టు చీరల విషయానికి వస్తే అనంతపురం జిల్లా ధర్మవరం పట్టుచీరల పరిశ్రమ పెద్దది. జిల్లాలో ధర్మవరం, హిందూపురం, యాడికి, సోమందిపల్లి... మొత్తం యాభై వేల చేనేత కుటుంబాలున్నాయి. ప్రభుత్వ నిర్ణయంతో వీరందరికీ మార్కెట్‌ సులభమవుతుంది. చేనేతకారుడికి– వినియోగదారుడికి మధ్య ఇద్దరు వ్యాపారులుంటారు. చేనేత కారుడికి గిట్టే ధరకు, వినియోగదారునికి అందే ధరకు మధ్య హస్తిమశకాంతరం తేడా ఉంటుంది.

ప్రభుత్వ నిర్ణయంతో వినియోగదారులకు ధర చేనేతకారుడికి రాబడి పెరుగుతుంది, ఖర్చు తగ్గుతుంది. ఈ– కామర్స్‌ ట్రేడింగ్‌ ద్వారా చేనేతకారులు తమ ఉత్పత్తులను నేరుగా వెబ్‌సైట్‌లో అప్‌లోడ్‌ చేస్తారు. తమకు గిట్టుబాటయ్యే ధరను వాళ్లే నిర్ణయించుకునే సౌలభ్యం ఉంటుంది. «ఒకటి– రెండు చీరలు, డ్రెస్సుల కోసం నగరాల నుంచి చేనేతకారుల దగ్గరకు వెళ్లలేని వినియోగదారులకు ఆన్‌లైన్‌లో కొనుగోలు చేయడం సౌకర్యంగా ఉంటుంది. మార్కెట్‌ విస్తరించే కొద్దీ అటకెక్కిన మగ్గాలు తిరిగి పని మొదలు పెడతాయి. మనదేశ కుటీర పరిశ్రమలు ప్రపంచదేశాల్లో తిరిగి మన ఉనికి చాటగలుగుతాయి.
ఇన్‌పుట్స్‌ : సాక్షి, ఏపీ నెట్‌వర్క్‌

ఇంకా ఎక్కువ పని చేస్తాం
తరతరాలుగా చీరలను నేయడమే మాకు తెలిసిన పని. ఆ పనిని వదిలి పెట్టడానికి మనసొప్పదు. మా వెంకటగిరి చేనేత చీరలకు అప్పుడూ ఇప్పుడూ ఎప్పుడూ మంచి పేరే ఉంది. అయితే మాకు మార్కెట్‌ చేసుకోవడం చేతకాకపోవడంతో నేసిన చీరలు అమ్ముడు పోయేవి కాదు. ఇప్పుడు ఆ పరిస్థితి ఉండదు. నేసినవి నేసినట్లు అమ్ముడు పోతుంటే మా పని మీద మాకు నమ్మకం పెరుగుతుంది. ఇంకా పని చేయాలనే ఉత్సాహం కూడా వస్తుంది.
– చల్లా గంగమ్మ, వెంకటగిరి, నెల్లూరు జిల్లా

ఊర్లు తిరిగి అమ్ముకున్నాం
మా చేనేత కుటుంబాల్లో ఇంటిల్లిపాదీ పని చేస్తుంటే ఒక మనిషి సైకిళ్ల మీద చీరల మూట పెట్టుకుని ఊర్లు తిరుగుతూ అమ్మేవాడు. అతడు ఇంటికి రాగానే ఇంటిపెద్ద మూట సైజు తగ్గిందా లేదా అని చూసేవాడు. ఇప్పటిలాగ అమ్మకాలకు ఒక రాజమార్గం ఉంటే... పిల్లలు మా వృత్తి నుంచి బయటకు వెళ్లేవాళ్లే కాదు. ఇప్పుడు మాకు బతుకు మీద ధైర్యం కలుగుతోంది.
 – పృథ్వీ శివపార్వతి, చీరాల, ప్రకాశం జిల్లా

మా బతుకుల్లో దివ్వెలు
మా వస్త్రాలను ఇష్టపడే వారికి మేమెక్కడుంటామో తెలియదు. ఒక చీరకు రెండు చీరలకు మా దగ్గరకు వచ్చి కొనడం కుదిరే పని కాదు. మార్కెటింగ్‌ చేతకాక ఇబ్బందులు పడుతున్నాం. ఒక్కోసారి గిట్టుబాటు ధర కూడా రాదు. మాకు అందుబాటులో ఉన్న వ్యాపారికి ఏదో ఒక ధరకు అమ్ముకోవాల్సిన పరిస్థితి. ఇప్పుడు మా కోసం ఆలోచించే నాయకుడు వచ్చాడు. ప్రభుత్వ నిర్ణయంతో మా బతుకుల్లో చిరుదివ్వెలు వెలుగుతాయి.
– జాడ లక్ష్మి, పొందూరు, శ్రీకాకుళం జిల్లా

పూర్వ వైభవం వస్తుంది
జగన్‌ సార్‌ ముఖ్యమంత్రి కాగానే మా చేనేత కుటుంబాలను ఆదుకోవడానికి ‘వైఎస్‌ఆర్‌ చేనేత నేస్తం’ పథకంతో మగ్గం ఉన్న కుటుంబానికి ఏడాదికి 24 వేల ఆర్థిక సహాయం చేయడానికి ముందుకొచ్చారు. ఇప్పుడు మా ఉత్పత్తులను మార్కెట్‌ చేసుకునే సౌలభ్యాన్ని కూడా కల్పిస్తున్నారు. ప్రభుత్వ సహాయం లేక కునారిల్లిన మా చేనేత కుటుంబాలకు ఇప్పుడు పూర్వ వైభవం వస్తుంది.
– ఆకురాతి నాగ మల్లీశ్వరి, మంగళగిరి,

భవిష్యత్‌ ఉజ్వలం
నెలలపాటు పని చేసి ఒక పట్టుచీర నేస్తే దాని మీద మిగిలిన డబ్బు చూసుకుంటే చేనేతకారులకు ఒక్కోసారి గుండె తరుక్కుపోతుంటుంది.  ఇప్పుడు ఒక భరోసా వచ్చింది. ప్రభుత్వం చూపించిన దారి వల్ల ఆషాఢం, శ్రావణం, సీజన్, అన్‌ సీజన్‌ అని లేకుండా ఏడాదంతా మార్కెట్‌ ఉంటుంది. ఆన్‌లైన్‌లో అమ్మడం నేర్చుకుంటే చేనేతకారుల బతుకులు బాగు పడతాయనే నమ్మకం కలుగుతోంది.
– జింకా మణిమాల, ధర్మవరం,

టెక్నాలజీ నేర్చుకుంటాం
ఇప్పటి వరకు మాకు తెలిసింది మగ్గం మీద దుస్తులు నేయడం, మా దగ్గరకు వచ్చిన వాళ్లకు వచ్చిన ధరకు అమ్ముకోవడం ఒక్కటే తెలుసు. ధర పెంచితే ఎవరూ కొనడం లేదని చెప్పే మధ్య వ్యాపారుల మాటకు తలూపక తప్పేది కాదు. ఇప్పుడు మేము చదువుకుంటున్న మా పిల్లలను అడిగి టెక్నాలజీ తెలుసుకుంటాం. ఆన్‌లైన్‌ మార్కెట్‌ చేయడం నేర్చుకుంటాం.
– కర్ణా భారతి, పాటూరు, నెల్లూరు జిల్లా

సృజనాత్మకత జోడిస్తాం
అగ్గిపెట్టెలో పట్టేటంత నాజూకైన చీర నేసిన నైపుణ్యం చేనేత రంగానిది. మా ఉప్పాడ చీరలు ఒక ట్రెండ్‌ని సృష్టించాయి. ఇంకా ఎన్నో ప్రయోగాలు చేయాలని ఉన్నప్పటికీ వాటిని కొనేవాళ్లు ఉండరనే భయంతో చేతులు కట్టేసుకుంటున్నాం. ఇప్పుడు మా చేనేత కళకు సృజనాత్మక జోడించి ప్రయోగాలు చేస్తాం.
– తిమ్మన నూకరత్నం,
కొత్తపల్లి, తూర్పుగోదావరి జిల్లా

ఒక వస్త్రం.. వంద దశలు
మహిళ చేతిలోకి ఒక పట్టుచీర వచ్చిందంటే... దాని వెనుక ఎన్ని దశలుంటాయో మన ఊహకు కూడా అందదు. రైతు పట్టుగూళ్లను పెంచుతాడు. ఆ పట్టుగూళ్లను కకూన్‌ మార్కెట్‌లో గవర్నమెంట్‌ మధ్యవర్తిగా ఉండి వ్యాపారితో కొనిపిస్తుంది. పట్టుగూళ్లు రీలింగ్‌ యూనిట్‌కి వెళ్తాయి. అక్కడ ముడిదారం తీస్తారు. ఆ ముడిదారాన్ని ఒక వ్యాపారి టోకున కొంటాడు. అక్కడి నుంచి చేనేతకారులు కొనుక్కుంటారు. ఆ ముడిదారాన్ని చేనేతకారుడు అద్దకందార్లకు ఇస్తాడు. రంగులద్దిన తర్వాత మరొకరు వార్పు పడతారు. దారం మగ్గాన్ని చేరడానికి ముందు ఇన్ని దశలుంటాయి. చేనేత వస్త్రాలకు మార్కెట్‌ పెరిగితే వీళ్లందరికీ రాబడి పెరిగినట్లే.

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top