
సైబర్ నేరాలకు చెక్ పెట్టేందుకు సరికొత్త కమాండో విధానం
పోలీసులకు శిక్షణ ఇచ్చేందుకు సిలబస్ రూపొందించిన ఐఐటీలు
నేరం జరిగిన క్షణాల్లోనే క్రిమినల్స్‌ను గుర్తించేలా శిక్షణ
ఐదేళ్లలో 500 మంది సైబర్ కమాండోల తయారీ లక్ష్యం
కాన్పూర్, మద్రాస్ ఐఐటీలతో పాటు కొట్టాయం,నయారాయపూర్ ఐఐఐటీల సహకారం
సాక్షి, హైదరాబాద్: వజ్రాన్ని వజ్రంతోనే కోయాలి అంటారు. దేశంలో పేట్రేగిపోతున్న సైబర్ కేటుగాళ్లకు అదే సైబర్ టెక్నాలజీతో చెక్ పెట్టే సరికొత్త వ్యవస్థ రూపుదిద్దుకోబోతోంది. ఇందుకోసం అన్ని రాష్ట్రాల నుంచి సైబర్ నేరాల దర్యాప్తులో చలాకీగా ఉన్న పోలీసులను గుర్తించి, ప్రత్యేక సైబర్ క్లాసులు చెప్పబోతున్నారు. దేశంలో సాంకేతిక విద్యలో అత్యున్నత సంస్థలైన పలు ఇండియ న్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ) లు, ట్రిపుల్ ఐటీలు ఈ దిశగా కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం బాధ్యతలు తీసుకోబోతున్నాయి. పోలీసులకు ఇవ్వాల్సిన సైబర్ శిక్షణతో కూడిన పాఠ్యాంశాల సిలబస్‌ను ఐఐటీలే రూపొందించాయి. 4 వేల మంది డిజిటల్ అనలిస్టులు, 6 వేల మంది అంతర్జాతీయ సైంటిస్టులు, 500 మంది ఐఐటీ టాపర్స్ కలిసి డిజిటల్ కమాండో వ్యవస్థను బలోపేతం చేసేందుకు నడుం బిగించారు.
అదుపు లేని మోసం: ప్రపంచవ్యాప్తంగా జరిగే డిజిటల్ లావాదేవీల్లో 47 శాతం భారత్‌లోనే జరుగుతున్నాయి. తాజా గణాంకాల ప్రకారం ఏడాదిలోనే రూ.20.68 లక్షల కోట్ల డిజిటల్ లావాదేవీలు జరిగాయి. అయితే, ఇదే స్థాయిలో సైబర్ మోసాలు కూడా పెరుగుతున్నాయి. జాతీయ సైబర్ నేరాల రిపోరి్టంగ్ పోర్టల్‌కు ఏడాది కాలంలో 7.6 లక్షల ఫిర్యాదులు అందాయి. రూ.7,488 కోట్ల ప్రజల సొమ్మును సైబర్ నేరగాళ్లు లూఠీ చేశారు. తెలంగాణలో జరిగిన సైబర్ మోసాల విలువ రూ.759 కోట్లు.
అయితే, ఈ మోసాలపై విచారణలో డబ్బు రికవరీ రేటు 18 శాతానికి మించడం లేదని కేంద్రం చెబుతోంది. ఇప్పుడున్న పోలీసు వ్యవస్థకు సైబర్ క్రిమినాలజీపై సరైన పట్టు లేకపోవడమే ఈ పరిస్థితికి కారణం. ఈ పరిస్థితిని మార్చేందుకు ఐఐటీలను ప్రభుత్వం రంగంలోకి దించింది. ప్రపంచవ్యాప్తంగా నేర సైకాలజీ, నేరాలను, వాటిని అడ్డుకునే సాంకేతికతలపై పోలీసులకు శిక్షణ ఇచ్చే సిలబస్‌ను రూపొందించాలని కోరింది. రెండేళ్లుగా సాగుతున్న ఈ కసరత్తు ఇప్పుడు కొలిక్కి వచ్చింది.
సిలబస్ ఇలా..
ఆన్‌లైన్ పెట్టుబడులు, షేర్ మార్కెట్లో లాభాలు వచ్చేలా చేస్తామని చెప్పే మోసాలు, ఓటీపీ ఆధారిత మోసాలు, గేమింగ్ బెట్టింగ్ యాప్‌ల పేరుతో దోచుకోవడం... ఇలా అనేక రకాల ప్రధాన డిజిటల్ మోసాలపై సమగ్ర సమాచారాన్ని విశ్లేశించారు. కాన్పూర్, మద్రాస్ ఐఐటీలు, నయారాయపూర్, కొట్టాయం ట్రిపుల్ ఐటీలు ఈ ప్రక్రియలో పాల్గొన్నాయి. చాలా కేసుల్లో దర్యాప్తు బృందాలు మేల్కొనే లోపే సైబర్ నేరగాళ్లు ప్లాట్ ఫాం మకాం మార్చేస్తున్నారు. వాడిన ఫోన్, బ్యాంక్ లావాదేవీలన్నీ మారుతున్నాయి.
ఈ వేగాన్ని తట్టుకునే లాంగ్ లరి్నంగ్ మాడ్యూల్స్‌ను (ఎల్‌ఎల్‌ఎం) ఐఐటీలు రూపొందించాయి. ఒక్క కమాండ్‌తో ఫ్రోటో వాయిస్ సిస్టమ్, కమాండో సిగ్నలింగ్ వ్యవస్థను, శరవేగంగా దూసుకెళ్తూ టార్గెట్ చేరుకునే మిసైల్ లాంగ్వేజ్ సిస్టమ్‌ను సిలబస్‌లో పొందుపర్చారు. మొత్తం ఆరు చాప్టర్లతో 200 సైబర్ నేరాల కమాండో వ్యవస్థతో సిలబస్ రూపొందించినట్టు ఐఐటీ ప్రొఫెసర్ ఒకరు తెలిపారు.
శిక్షణ ఎవరికి?
ఏటా 350 మందిని కమాండ్ సిస్టమ్‌లోకి తెస్తారు. వీరికి ఆధునిక సిలబస్‌తో కూడిన విద్యను బోధిస్తారు. రాష్ట్ర పోలీసు అధికారులే నిర్వహణ బాధ్యత తీసుకున్నా.. బోధన, ప్రణాళిక మొత్తం ఐఐటీలు రూపొందిస్తాయి. ఐదేళ్లపాటు సాగే ఈ ప్రక్రియలో ఎప్పటికప్పుడు కొత్త సైబర్ నేరాలపై విశ్లేషణ ఉంటుంది. సైబర్ నేరగాడు వాడే ఐపీ అడ్రస్‌తో పాటు, దానికి అనుసంధానమైన టవర్, సిమ్ కదలికలపైనా సరికొత్త టెక్నాలజీతో దాడిచేసే విధంగా శిక్షణ ఉంటుంది. కొన్ని క్లాసులు ఆన్‌లైన్‌లో ఉంటే, మరికొన్ని ప్రయోగాత్మకంగా ఆఫ్‌లైన్‌లో నిర్వహిస్తారు. ఐదేళ్లలో 5 వేల మంది నిష్ణాతులైన డిజిటల్ దర్యాప్తు అధికారులను రూపొందించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.