
రజకుల చెరువులను సర్వే చేసి హద్దులు నిర్ణయించాలి
జంగారెడ్డిగూడెం: ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలోని అనేక మండలాల్లో రజకుల చెరువులు ఆక్రమణలకు గురయ్యాయని, దీంతో రజక వృత్తికి ఆటంకం ఏర్పడుతుందని ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా రజకజన సంఘ అధ్యక్షుడు, రాష్ట్ర రజక సంఘ ప్రధాన కార్యదర్శి చిలకలపల్లి కట్లయ్య ఆవేదన వ్యక్తం చేశారు. రజక చెరువుల ఆక్రమణలకు అడ్డుకట్ట పడాలంటే చెరువులను సర్వేయర్లతో సర్వే చేయించి హద్దులు నిర్ణయించాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు. గురువారం జంగారెడ్డిగూడెం, కొయ్యలగూడెం మండలాల్లో ఆక్రమణలకు గురైన చెరువులను రజక సంఘాలతో కలిసి పరిశీలించి సంబంధిత అధికారులతో మాట్లాడారు. జంగారెడ్డిగూడెం మండలం లక్కవరంలో రజకులకు సుమారు 50 ఏళ్ల క్రితం కేటాయిచిన 3.11 ఎకరాల కోనేరు చెరువు ఆక్రమణలకు గురవ్వడంతో రజక వృత్తి చేసుకునేందుకు రజకులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. దీనిపై గ్రామ కార్యదర్శి నాగేశ్వరరావుతో మాట్లాడగా చెరువుని రజకులకు ఉపయోగపడే విధంగా చేస్తామని తెలిపారన్నారు. అలాగే చెరువులో సరిగా నీరు లేనందున లీజు రూ. 11వేలు రద్దు చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి జిల్లా రజక సంఘ మహిళా అధ్యక్షురాలు మెట్ట లక్ష్మీ ప్రసన్న, గ్రామ రజక సంఘం నాయకులు పాల్గొన్నారు.