
పేదలకు మెరుగైన వైద్యసేవలు
అమరచింత: ప్రభుత్వ ఆస్పత్రులకు వచ్చే పేదలకు మెరుగైన వైద్యసేవలు అందించాలని జిల్లా వైద్యాధికారి డా. శ్రీనివాసులు కోరారు. మంగళవారం మండల కేంద్రంలోని డీఎంఆర్‌ఎం ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్యకేంద్రంలో నిర్వహించిన ఆరోగ్య మహిళ కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. జిల్లాలోని అన్ని ప్రభుత్వ ఆస్పత్రులు, పీహెచ్‌సీలు, బస్తీ, పల్లె దవాఖానాల్లో ఉచిత వైద్య శిభిరాలు నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. కంటి, దంత తదితర వైద్య పరీక్షలతో పాటు క్షయ నిర్ధారణ పరీక్షలు నిర్వహిస్తున్నారని.. ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. శిభిరాలకు వస్తున్న రోగులకు జబ్బుల నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు వివరించడంతో పాటు తగిన వైద్యసేవలు అందిస్తున్నామన్నారు. అనంతరం పీహెచ్‌సీ సిబ్బంది పనితీరుతో పాటు ఏఎన్‌ఎం, ఆశ కార్యకర్తల పనితీరును వైద్యాధికారి డా. ఫయాజ్‌ను అడిగి తెలుసుకున్నారు. ఆస్పత్రిలో ప్రసవించిన మహిళను పరీక్షించి ప్రభుత్వ ఆస్పత్రులపై ప్రజలకు నమ్మకం కలిగేలా సాధారణ ప్రసవాలు చేస్తున్నామని చెప్పారు. ఆయన వెంట డా. శ్రావ్యా, డా. మానస, సీహెచ్‌ఓ సురేష్‌కుమార్, హెల్త్ సూపర్‌వైజర్ ఆదిలక్ష్మి తదితరులు ఉన్నారు.