
పీహెచ్‌సీల్లో ప్రసవాల సంఖ్య పెరగాలి
పాన్‌గల్: గ్రామాల్లోని గర్భిణుల పేర్లు నమోదు చేసుకొని ప్రభుత్వ ఆస్పత్రుల్లోనే ప్రసవాలు చేయించుకునేలా అవగాహన కల్పిస్తూ కాన్పుల సంఖ్య పెంపునకు వైద్య సిబ్బంది, ఆశ కార్యకర్తలు కృషి చేయాలని జిల్లా అదనపు వైద్యాధికారి డా. శ్రీనివాసులు కోరారు. మంగళవారం మండల కేంద్రంలోని పీహెచ్‌సీలో నిర్వహించిన ఆశా కార్యకర్తల నెలవారీ సమీక్లకు ఆయన హాజరై మాట్లాడారు. సీజనల్ వ్యాధులు ప్రబలకుండా అప్రమత్తంగా ఉంటూ నివారణకు తగిన చర్యలు చేపడుతూ ప్రజలను చైతన్యం చేయాలన్నారు. క్షయ, కుష్టు తదితర జాతీయ కార్యక్రమాలపై అవగాహన కల్పిస్తూ ఏ రోజు వివరాలు అదేరోజు నమోదు చేయాలని సూచించారు. విధుల్లో అలసత్వం ప్రదర్శించే వైద్యసిబ్బందిపై చర్యలు తప్పవని హెచ్చరించారు. సమావేశంలో పీహెచ్‌సీ వైద్యుడు డా. చంద్రశేఖర్, ఎంఎల్‌హెచ్‌పీ వైద్యులు డా. నాగరాజు, డా. మైథిలి, నిహారిక, వైద్య సిబ్బంది, ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు.