
అరసన్‌గా.. శింబు
తమిళసినిమా: నటుడు శింబు కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రంపై అంచనాలు పెరిగిపోతున్నాయి. ఈయన వెట్రి మారన్ దర్శకత్వంలో నటిస్తున్న ఈ చిత్రాన్ని నిర్మాత కలైపులి ఎస్.ధాను తన వీ క్రియేషనన్స్ పతాకంపై భారీ ఎత్తున నిర్మిస్తున్నారు. ఈ చిత్ర షూటింగ్ ఇటీవల చైన్నెలో ప్రారంభమైంది. అదేవిధంగా దర్శకుడు వెట్రి మారన్ పుట్టినరోజు సందర్భంగా ఈ చిత్రానికి సంబంధించిన ఒక వీడియోను విడుదల చేశారు. అది శింబు అభిమానుల్లో ఫుల్ జోష్‌ను నింపింది. కాగా ఉత్తర చైన్నె నేపథ్యంలో సాగే గ్యాంగ్ స్టార్స్ ఇతివృత్తంతో సాగే కథా చిత్రమని సమాచారం. లేకపోతే ఇందులో నటుడు శింబు ద్విపాత్రాభినయం చేస్తున్నట్లు తెలిసింది. ఇందులో దర్శక, నటుడు సముద్రఖని, కిషోర్, నటి ఆండ్రియా, దర్శకుడు నెల్సన్ తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నట్లు సమాచారం. అదేవిధంగా నటి సమంత ఈ చిత్రంలో నటించబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది. అయితే దీనికి సంబంధించిన ఎలాంటి అధికార ప్రకటన కాలేదన్నది గమనార్హం. త్వరలోనే ఇందులో నటించే కథానాయకి, ఇతర సాంకేతిక వర్గం వివరాలను అధికారికంగా ప్రకటించనున్నట్లు నిర్మాతల వర్గం పేర్కొన్నారు. కాగా శింబు 49వ చిత్రంగా రూపొందుతున్న ఈ చిత్రానికి అరసన్ అనే టైటిల్ ను ఖరారు చేసారు. ఈ టైటిల్ చిత్ర నిర్మాత కలైపులి ఎస్. ధాను మంగళవారం తన ఎక్స్ మీడియాలో టైటిల్‌తో కూడిన పోస్టర్‌ను పోస్ట్ చేశారు. అదేవిధంగా అందులో ఆళ పిరంద అరసన్. విజయంతో సిలంబరసన్ ( ఏలడానికి పుట్టిన రాజు. విజయంతో సిలంబరసన్) అనే ట్యాగ్‌ను పొందుపరిచారు. ఈ చిత్ర పోస్టర్ ఇప్పుడు టాక్ ఆఫ్ ద ఇండస్ట్రీగా మారడంతో పాటు శింబు అభిమానులను ఫిదా చేస్తోంది.