
నేరం చేయకుంటే పరామర్శించాలి
వేలూరు: టీవీకే అధ్యక్షుడు విజయ్ నేరం చేయకుంటే అతని అనుచరులతో కలిసి బాధితులను నేరుగా వెళ్లి పరామర్శించి ఉండవచ్చు కదా అతను నేరం చేశాడు కాబట్టే అక్కడికి వెళ్లేందుకు భయపడుతున్నాడని రాష్ట్ర మంత్రి దురైమురుగన్ అన్నారు. వేలూరు జిల్లా గుడియాత్తం సమీపంలోని మోర్దన డ్యామ్‌లో ఇటీవల కురిసిన వర్షాలకు నిండి మొరవ పారుతోంది. వీటిని పరిశీలించేందుకు మంగళవారం ఉదయం ఆయన అధికారులతో కలిసి వెళ్లారు. ఆయన విలేకరులతో మాట్లాడుతూ కచ్చదీవుల గురించి బీజేపీ అధ్యక్షుడు నైనా నాగేంద్రన్ మాట్లాడడం విడ్డూరంగా ఉందన్నారు. ఆయనకు కచ్చ దీవుల గురించి ఏ మాత్రం అవగాహన లేదని ఎవరో రాసి ఇస్తే వాటిని చదివి ఉంటారని ఆయన ఎద్దేవా చేశారు. ప్రస్తుతం తాను చూస్తున్న మోర్దన డ్యామ్‌ను 1990వ సంవత్సరంలో తాను శంకుస్థాపన చేసి 2001వ సంవత్సరంలో పూర్తి చేసి ప్రారంభించామని తెలిపారు. ప్రస్తుతం ఈ డ్యామ్ నిండి నీరు బయటకు పోవడంవల్ల 12 చెరువులకు, 25 గ్రామాల్లోని 3,937.63 ఎకరాలకు సాగు నీరు అందుతోందన్నారు. రైతులు వీటిని సద్వినియోగం చేసుకొని ఆరుతడి పంటలను పండించుకోవాలన్నారు. కలెక్టర్ సుబ్బలక్ష్మి, ఎమ్మెల్యే అములు, నీటి పారుదల శాఖ చీఫ్ ఇంజినీర్ పవలకన్నన్, ఇంజినీర్ వెంకటేష్, వేలూరు కార్పొరేషన్ డిప్యూటీ మేయర్ సునీల్‌కుమార్ పాల్గొన్నారు.