
భక్తులతో కిటకిటలాడిన గిరివలయం
వేలూరు: తమిళ పెరటాసి మాస పౌర్ణమిని పురస్కరించుకొని సోమవారం మధ్యాహ్నం నుంచి తిరువణ్ణామలై అరుణాచలేశ్వరాలయ గిరివలయం రోడ్డు భక్తులతో కిటకిటలాడింది. ఈనెల పౌర్ణమి ఈనెల 6న సోమవారం మద్యాహ్నం 11.49 ప్రారంభమై మంగళవారం ఉదయం 9.53 గంటలకు ముగిసింది. దీంతో సోమవారం సాయంత్రం మాడ వీధులు భక్తులతో కిటకిటలాడాయి. ఇదిలా ఉండగా ఉదయం 4 గంటలకు ఆలయాన్ని తెరిచి స్వామివార్లకు ప్రత్యేక అభిషేకాలు, పూజలు చేశారు. రాత్రి పూర్తిగా గిరివలయం చుట్టి వచ్చిన భక్తులు వేకువజామునే అధిక సంఖ్యలో బారులు తీరి స్వామివారిని దర్శించుకున్నారు. ఆలయ జాయింట్ కమిషనర్ భరణీధరన్ అధ్యక్షతన ఆలయంలో భక్తులకు అవసరమైన అన్ని ఏర్పాట్లను సిద్ధం చేశారు. అదేవిధంగా ఆలయంలోని అన్నామలైయార్ సమేత ఉన్నామలై అమ్మవారికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు చేసి పుష్పాలంకరణలు చేశారు. మాడ వీధులతోపాటు గిరివలయం రోడ్డులోనూ భక్తులు అధిక సంఖ్యలో తరలిరావడంతో తిరువణ్ణామలైలో సోమవారం రాత్రితోపాటు మంగళవారం ఉదయం నుంచి సాయంత్రం వరకు గిరివలయం రోడ్డు భక్తులతో కిటకిటలాడింది. స్వామివార్లను మాడ వీధుల్లో ఊరేగించారు. భక్తులు అధిక సంఖ్యలో కర్పూర హారతులు పట్టి మొక్కులు తీర్చుకున్నారు.